ప్రభుత్వాస్పత్రులకు మెరుగులు
⇒ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
⇒ త్వరలో రూ.12 కోట్లతో ‘గాంధీ’కి వైద్య పరికరాలు, ఫర్నిచర్
⇒ అన్ని ఆస్పత్రులను కొత్తగా తీర్చిదిద్దుతామని వెల్లడి
⇒ హెల్త్‌కార్డుల ద్వారా చికిత్సల్లో లోపం లేదని స్పష్టీరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరిచే పనులు ప్రారంభించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అవసరమైన వైద్య పరికరాలను అందించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిని సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులు చూసి సిగ్గుపడాల్సి వచ్చిం దని.. గత ప్రభుత్వాల పాపమే దీనికి కార ణమని, ఇప్పుడు వాటిని మెరుగు పరిచేం దుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చాలా మార్పులొచ్చాయని, లిఫ్టులను రోగు లకు అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్యశాఖ పద్దుపై గురువారం శాసనసభలో లక్ష్మారెడ్డి ప్రసంగించారు. గాంధీ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో కొత్త వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
690 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగు పరిచినట్టు తెలిపారు. అన్ని ఆస్పత్రులు కలిపి 20 వేల బెడ్స్ ఉంటే ఇప్పటికే 10 వేల కొత్త బెడ్‌షీట్స్ ఏర్పాటు చేశామని, మొత్తం లక్ష బెడ్‌షిట్స్ సమకూర్చుకునేందుకు ఆర్డర్ ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో నిమ్స్ స్థాయిలో కొత్తగా మూడు ఆస్పత్రులు నిర్మించనున్నట్టు మంత్రి వివరించారు. కొత్తగా నాలుగు ఆస్ప త్రుల్లో ఐసీయూ సేవలు ప్రారంభించామని, అన్ని ఆస్పత్రుల్లో ఐసీ యూలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పేదలందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రభుత్వా స్పత్రుల్లో అవినీతిని నిరోధించేందుకు కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హెల్త్‌కార్డుల ద్వారా చికిత్సల్లో లోపం లేదని, ఇప్పటివరకు లక్షా ఆరు వేల మందికి ఆ పద్ధతి లో చికిత్సలు అందించామన్నారు. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులను చేర్చాక గత మూడు నెలల్లో 4,200 మందికి చికిత్సలు అందిం చినట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు. గద్వాల ఆస్పత్రి స్థాయి పెంపుతోపాటు రూ. 1.4 కోట్లతో ఐసీయూను మెరుగుపరుస్తున్నామని, తుంగతుర్తిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు.
అర్చకులకు ట్రెజరీ వేతనాలు కుదరదు: ఇంద్రకరణ్‌రెడ్డి
దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం సాధ్యం కాదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు, రోస్టర్ నిబంధనల ప్రకారం కాకుండా కేవలం ఆలయ చైర్మన్‌ల ద్వారా వారు నియమితులు కావడమే అందుకు కారణమన్నారు. ప్రభుత్వోద్యోగులకు దాదాపు సమంగా ఉండేలా వారికి వేతనాలు చెల్లించాలని నిర్ణయించామని, మరో పద్ధతిలో వారికి వేతనాల చెల్లింపు ఉంటుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదన సిద్ధం చేస్తోందన్నారు. సంవత్సరంలోపు యాదాద్రిని తెలంగాణ తిరుమలగా తీర్చి దిద్దుతామన్నారు.
స్థలం ఉంటే కొత్త స్టేడియాలు: పద్మారావు
నియోజకవర్గ కేంద్రాల్లో స్థలం సిద్ధంగా ఉంటే కొత్త స్టేడియాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పద్మారావు వెల్లడిం చారు. హైదరాబాద్‌లో 15 నియోజకవర్గాల్లో స్టేడియాలు ఉండేలా ప్రతి పాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో దుకాణదారులు అక్రమంగా సగంప్రాంతాన్ని కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారని, వాటిని తొలగిస్తామన్నారు. కొత్తగూడెం, కోరుట్ల, తుంగ తుర్తిలకు కొత్త స్టేడియాలు మంజూరయ్యాయని, భద్రాచలంలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు.
కనీసం వేతన చట్టం అమలు: నాయిని
రాష్ట్రంలో కనీస వేతన చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. పదేళ్లుగా కనీసం వేతన బోర్డు లేదని, తమప్రభుత్వం ఏర్పాటయ్యాక దాన్ని ఏర్పాటు చేసినట్లు సభ దృష్టికి తెచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంలో కార్మిక శాఖ కృషి ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 1,200 పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా 760 పరిశ్రమలకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. కార్మిక చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన 193 పరిశ్రమల యజమానులపై కేసులుపెట్టి 84 లక్షల పెనాల్టీ వసూలు చేశామన్నారు.