ప్రాణహిత ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరమే ఓ అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర సర్వే జరిగితేనే ప్రతిపాదిత కాళేశ్వరం దిగువన నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలు స్పష్టమవుతాయని అంచనా వేస్తోంది. గోదావరిలో హైడ్రాలజీ లెక్కలను పునఃపరిశీలన చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లుగా సమాచారం.
ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడంతో తమ భూభాగంలోని 4,500 ఎకరాల మేర ఆయకట్టు ముంపునకు గురవుతోందని, ఈ దృష్ట్యా బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ఇటీవల రాష్ట్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు రీ డిజైన్‌పై దృష్టిసారించిన ప్రభుత్వం కాళేశ్వరం దిగువన మేటిగడ్డ ప్రాంతం నుంచి నీటిని మళ్లించే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతోపాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పరిగణనలోకి తీసుకొని ఎల్లంపల్లి వరకు ఇప్పటికే రూ.4 వేల కోట్లతో కెనాల్‌ల తవ్వకం పూర్తి చేశారు.
ప్రస్తుతం డిజైన్‌ను మార్చి కాళేశ్వరం వరకు నీటిని తరలించాలంటే కొత్తగా కెనాల్ తవ్వాలి. అదే జరిగితే ఇప్పటికే పనులు చేసిన కెనాల్‌ల ఖర్చు వృథా కానుండగా, కొత్త కెనాల్‌ల కోసం మరింత వ్యయం చేయాల్సి ఉంటుంది. సమగ్ర సర్వే జరిగితే పాత కాల్వలను యధావిధిగా వాడుకోవచ్చా, లేక కొత్త కాల్వల నిర్మాణం అవసరమైతే దానికి అయ్యే వ్యయం ఎంత అన్నది తేలుతుంది. దీంతో త్వరలోనే వ్యాప్‌కోస్ ప్రతినిధులతో మరోమారు భేటీ అయి ఓ స్పష్టతకు రావాలని నిర్ణయించినట్లు తెలిసింది.
సర్వే తర్వాతే రీడిజైన్
Published Tue, Mar 31 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement
Advertisement