కామారెడ్డి: అమ్మ కడుపులో నవ మాసాలు పెరిగిన శిశువు.. గర్భం నుంచి ఈ ప్రపంచంలోకి రాగానే.. ముర్రిపాల అమృతంతో కడుపు నింపుకోవాల్సిన సమయం.. అమ్మ నులివెచ్చని పొత్తిళ్లలో ఒదిగిపోవాల్సిన శిశువులు.. ఆడపిల్ల అన్న చిన్నచూపో.. మరేకారణమో.. ఆడ శిశువులు కళ్లు తెరిచేసరికి ముళ్లపొదలు, మురికి కాలువలు, పాడుబడ్డ బావుల్లోకి చేరుతున్నారు. ఆడపిల్లను భారంగా భావించేవారు వారిని వదిలేసుకుంటున్న వైనం.. సభ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఒకవైపు ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా ‘ఆడపిల్ల’ అన్న వివక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతున్నా సృష్టికి మూలమైన ఆడజన్మను కాపాడాల్సిన చేతులే కాటికి పంపుతుండడం విస్మయపరుస్తోంది.
తాజాగా మాచారెడ్డి మండలం పల్వంచ గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ఓ పాడుబడ్డ బావిలో పడేసిన ఘటన సమాజాన్ని తట్టిలేపింది.
ఆ పాప అరుపులు విన్న గ్రామస్తులు బావి నుంచి బయటకు తీసి కాపాడారు. పేదరికం, నిరక్షరాస్యత వెరసి ఆడపిల్ల అన్న భావన ఇంకా సమాజాన్ని వదలడం లేదు. ఆడపిల్లలు ఎంత ఎత్తుకు ఎదుగుతున్న వారిపై వివక్ష పోవడం లేదు. గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు తుంచేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వీలుకాని పరిస్థితుల్లో పుట్టిన శిశువును మురికి కాలువల్లోనో, ముళ్ల పొదల్లోనో, పాడుబడ్డ బావులు, చెత్తకుప్పల్లోనూ విసిరేస్తున్నారు. మగపిల్లవాడు కావాలని ఎంతో మంది ఆరాపడుతుంటారు. మగపిల్లాడి కోసం ఎన్ని అబార్షన్లయినా చేయించుకునేవారు లేకపోలేదు.
వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుడితే చాలు మగపిల్లాడి కోసం మరో ప్రయత్నం చేయడం, గర్భంలో ఉన్నపుడే ఆడ, మగా తెలుసుకుని ఆడపిల్లని తెలిస్తే చాలు తుంచేసేందుకు వెనుకాడడం లేదు. కొందరు రెండు, మూడు అబార్షన్లు చేయించుకున్నవారు ఉంటున్నారంటే ఆడపిల్ల మీద ఎంత వివక్ష, మగపిల్లవానిమీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఐదువేల మంది బాలికలు తక్కువ....
జిల్లా జనాభా 25,51,335 మంది ఉండగా, మహిళలు 13,00,694 మంది, పురుషులు 12,50,641 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 50 వేల మంది ఎక్కువగా ఉన్నారు. అయితే నాలుగేళ్లలోపు పిల్లల విషయానికి వచ్చే సరికి పరిస్థితులు తలకిందులయ్యాయి. జిల్లాలో 4 సంవత్సరాల లోపు పిల్లలు 1,94,793 మంది ఉంటే బాలురు 99,714 మంది, బాలికలు 95,079 మంది ఉన్నారు.
అంటే జిల్లాలో 5 వేల మంది వరకు ఆడపిల్లలు తక్కువగా ఉన్నారనేది అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఆడపిల్లలు దొరక్క మగపిల్లలు చాలా మందికి పెళ్లిళ్లు కుదరడం లేదు. రాబోయే 15 యేళ్ల తరువాత పెళ్లికాని ప్రసాద్‌లు జిల్లాలో వేలాది మంది మిగులుతారు. ఈ పరిస్థితి జిల్లాలోనే కాక రాష్ట్రమంతటా ఉండడంతో భవిష్యత్తు బాలికలదేనని స్పష్టమవుతోంది.
బంగారు తల్లులను కాపాడుకోవాలి....
రోజురోజుకూ తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బంగారు తల్లులను కాపాడుకోకుంటే భవిష్యత్తు అంధకారమేనన్న విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వాలు అబార్షన్ల నియంత్రణకు ఎన్ని చట్టాలు తెచ్చినా యథేచ్ఛగా లింగనిర్దారణ పరీక్షలు జరుగుతుండడం, ఆడపిల్ల సంరక్షణకు ఎన్ని పథకాలు తీసుకువచ్చినా అవి వారి ధరికి చేరకపోవడం వంటి కారణాలు బంగారు తల్లుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. గత ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా అది ప్రయోజనం కలిగించలేకపోయింది. వరకట్న దురాచారం, ఆడపిల్ల అన్న వివక్ష వంటి వాటిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు, ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయ్యో... ‘బంగారం’
Published Sun, Aug 10 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement