‘కాళేశ్వరం’పై భిన్నాభిప్రాయాలు!
ప్రాజెక్టులోని గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో, కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా 93 మంది ప్రజాప్రతినిధులు, ముంపు బాధితులు, రైతులు, వివిధ వర్గాల వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇస్తున్న ప్యాకేజీని ఇక్కడి నిర్వాసితులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ప్రజాభిప్రాయ సేకరణను గంధమల్ల గ్రామస్తులు బహిష్కరించారు.
అధికారులు తమ గ్రామానికే వచ్చి ఎటువంటి పరిహారం అందిస్తారో తెలియజేయాలన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కొండపోచమ్మ నిర్వాసితులకు ఇచ్చిన మాదిరిగానే తమకు కూడా పరిహారం చెల్లించాల ని మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని, సర్వం కోల్పోతున్న తమకు పూర్తిగా న్యాయం చేశాకే.. ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లాలని కోరారు. ఇక కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రేకుర్తిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా కాళేశ్వరానికి ఏకాభిప్రాయం వ్యక్తమైంది.