ఇళ్ల అక్రమాలపై సీఐడీ విచారణ | Regard to fraud committed homes CID inquiry | Sakshi
Sakshi News home page

ఇళ్ల అక్రమాలపై సీఐడీ విచారణ

Published Sun, Jul 27 2014 12:39 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

ఇళ్ల అక్రమాలపై సీఐడీ విచారణ - Sakshi

ఇళ్ల అక్రమాలపై సీఐడీ విచారణ

అర్హులెవరో తేలాకే కొత్తగృహాల నిర్మాణం :  కేసీఆర్
 
హైదరాబాద్: పేదల ఇళ్ల నిర్మాణంలో అక్రమాల నిగ్గుతేల్చేందుకు ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని  గట్టిగా నమ్ముతున్న ఆయన కొంతకాలంగా ఈ విషయంలో అధికారులను ఉరుకులుపరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే.  శాంపిల్ సర్వేగా  థర్డ్‌పార్టీ 593 గ్రామాలలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించగా, రూ.235 కోట్లవరకు అక్రమాలు జరిగినట్టు తేలింది. దీన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. దీంతో తెలంగాణ అంతటా భారీగా అక్రమాలు జరిగినట్టు ఆయన భావిస్తున్నారు. అయితే థర్డ్ పార్టీ పరిశీలన లోపభూయిష్టంగా జరిగిందని, ఆ పరిశీలనకు ఎంచుకున్న ప్రాతిపదిక కూడా సరికాదని అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అక్రమాలకు తావులేకుండా చేసిన తర్వాతనే కొత్తగా గృహనిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా, 2004 - 2014 మధ్యకాలంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ సంఖ్యలో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం జరిగినందున, అప్పటి అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు సీఐడీని రంగంలోకి దింపారు. శనివారం సాయంత్రం గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇళ్లు కట్టకున్నా బిల్లులు...!

తెలంగాణలో దాదాపు 36 వేల ఇళ్లను నిర్మించకున్నా... కట్టినట్టు రికార్డుల్లో చూపి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని  బుర్రా వెంకటేశానికి సీఎం తెలిపారు. మొత్తం అక్రమాల్లో 75 శాతం వరకు 2008-09 కాలంలోనే జరిగాయని, అప్పట్లో 13 ల క్షల ఇళ్ల కోసం  ప్రభుత్వం రూ.5500 కోట్లు విడుదల చేసిందని సీఎం పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో అందరికీ ఇళ్లున్నప్పటికీ 99 శాతం మందికి గృహనిర్మాణ పథకం కింద ఇళ్లను నిర్మించినట్టు రికార్డులు సృష్టించారని, వాస్తవానికి ఒక్క ఇంటిని కూడా కట్టలేదని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో 45 వేలు, మంథని నియోజకవర్గంలో 41 వేలు, కొడంగల్‌లో 32,337 , పరిగిలో 30 వేల ఇళ్లు నిర్మించినట్టు చెబుతున్నా అవన్నీ తప్పుడు లెక్కలని సీఎం పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం విచారణ జరిపి అక్రమాలకు బాధ్యులైన 490 మంది అధికారులను సస్పెండ్ చేయటంతోపాటు 285 మందిని డిస్మిస్ చేసిందని, ఇంకా కొందరు జైళ్లలోనే ఉన్నారని వెంకటేశం ఆయన దృష్టికి తెచ్చారు.

బోగస్ రేషన్ కార్డులపైనా నజర్...

కొత్తగా కట్టే రెండు పడకగదుల ఇళ్ల విషయంలో అవినీతికి అవకాశం ఉండొద్దనే సీఐడీ విచారణకు ఆదేశించాలని నిర్ణయించినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. పేదలకు చెందాల్సిన ఒక్క పైసా తిన్నా శిక్ష తప్పదనే భయం కలగాలని అన్నారు. పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్‌కార్డులు లాంటి వాటిల్లోనూ ఇదే పరిస్థితి ఉందని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. బోగస్ కార్డుల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే బోగస్ రేషన్ కార్డుల అంశాన్ని తేల్చేందుకు సీఐడీని రంగంలోకి దింపాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.
 
4 లక్షలమందితో ఒకేరోజు సర్వే....

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 83.59 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సర్వే నిర్వహించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. భవిష్యత్తులో అవినీతి అక్రమాలకు తావు ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వంలోని 4 లక్షల మంది ఉద్యోగులతో కేవలం ఒక్క రోజులో సర్వే పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే నెల ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీఓలు, తహశీల్దార్లతో నగరంలో సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నట్టుప్రకటించారు. అనంతరం అర్హులెవరో గుర్తించి సరికొత్త గృహనిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement