- శుభకార్యానికి వచ్చి..
- తుంగభద్రనదిలో దంపతుల గల్లంతు
- రెండు కుటుంబాల్లో విషాదం
సరదా ప్రాణం తీసింది.. బంధువుల శుభకార్యానికి వచ్చిన దంపతులు తుంగభద్ర అందాలను తిలకిచేందుకు వెళ్లి నదిలో గల్లంతయ్యారు. భార్య మృతిచెందగా, భర్త ఆచూకీ తెలియరాలేదు. ఈ సంఘటనతో ఆ సందడి ఒక్కసారిగా మూగబోయింది. ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం ఆవహించింది.
అలంపూర్ : బంధువుల శుభకార్యానికి వచ్చిన దంపతుల సరదా ప్రాణాల మీదుకు తెచ్చింది. నదీ తీరంలో బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం దంపతుల గల్లంతుతో ఒక్కసారిగా విషాదంగా మారింది. సరదాగా విహరిద్దామని వచ్చిన వారు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆచూకీ తెలియరాలేదు.
వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు నగరం ఖడక్‌పురకు చెందిన నూర్‌బాషా (26) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు అక్కడి బుధవారపేటకు చెందిన యాస్మిన్ (20) తో ఏడాదిక్రితం వివాహమైంది. ఈమెకు అలంపూర్ పట్టణానికి చెందిన యూసూఫ్‌బాషా వరుసకు చిన్నాన్న అవుతారు. అతని కుమారుడి పుట్టు వెంట్రుకలు కార్యక్రమం శుక్రవారం అలంపూర్ పట్టణంలోని తుంగభద్రా తీరంలో ఉన్న బీబీదర్గా వద్ద నిర్వహించారు. ఈ వేడుకలకు దంపతులతోపాటు బంధుమిత్రులు హాజరయ్యారు. భోజనాలు చేసిన వారు కొద్దిసేపు విహరించడానికి వెళ్లారు. ఎంతకూ తిరగి రాకపోవడంతో ఆందోళనకు గురై వెతకసాగారు. చివరకు సాయంత్రం యాస్మిన్ మృతదేహం కనిపించగా నూర్‌బాషా జాడ మాత్రంలేదు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ పర్వతాలు, తహశీల్దార్ మంజుల పరిశీలించారు. స్థానిక గజ ఈతగాళ్లతో గల్లంతైన నూర్ బాషా కోసం అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.