వస్త్ర నిల్వలు, నూలు ధరలపై జౌళిశాఖ అధికారుల ఆరా
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై చేనేత జౌళిశాఖ నివేదిక సిద్ధం చేసింది. వస్త్రపరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ‘నేతన్న బతికి ‘బట్ట’కట్టేదెలా?’శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో మం గళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన చేనేత, జౌళిశాఖ అధికారులు.. సిరిసిల్లలో పేరుకు పోయిన పాలిస్టర్ వస్త్రం నిల్వలు, నూలు ధరల పెరుగుదలపై మంగళవారం క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. అమ్ముడుపోని వస్త్రంతో నేత కార్మికులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నూలు ధరలు పెరగడంతో నేతన్నలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
అందరూ పాలిస్టర్ వస్త్రాన్నే ఉత్పత్తి చేయడంతో మార్కెట్‌లో ధర లేదని నిర్ధారించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా సూచిస్తూ.. చేనేత, జౌళిశాఖ అధికారులు నివేదిక రూపొందించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ ద్వారా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌కు నివేదిక పంపుతున్నట్టు జౌళిశాఖ ఏడీ వి.అశోక్‌రావు మంగళవారం రాత్రి తెలిపారు. పాలిస్టర్ వస్త్రోత్పత్తి రంగం పెరిగిన నూలు ధరలతో ఇబ్బందుల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై నివేదిక
Published Wed, Jan 18 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
Advertisement