తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గణతంత్ర వేడుకలు చాలా సాదాసీదాగా జరగనున్నాయి. వేడుకలు ఆలస్యం కానున్న నేపథ్యంలో పలు కార్యక్రమాలను రద్దు చేశారు.
* ఉదయం జాతీయ పతాకావిష్కరణ చేయనున్న గవర్నర్
* విద్యార్థుల కవాతు, శకటాల ప్రదర్శన ఉండదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గణతంత్ర వేడుకలు చాలా సాదాసీదాగా జరగనున్నాయి. వేడుకలు ఆలస్యం కానున్న నేపథ్యంలో పలు కార్యక్రమాలను రద్దు చేశారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గవర్నర్ నరసింహన్ ఒక్కరే పతాకావిష్కరణ చేయాల్సి రావడంతో వేడుకల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట ఆంధ్రప్రదేశ్‌లో ఏడున్నర గంటలకే విజయవాడలో గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్.. అక్కడ కార్యక్రమం ముగించుకుని పరేడ్ గ్రౌండ్‌లో కార్యక్రమానికి 10.30 గంటలకు హాజరుకానున్నారు. ఈలోగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఉదయం నుంచి పరేడ్‌గ్రౌండ్‌లో నిల్చుని ఉంటే.. అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉన్నందున వారి కవాతును కార్యక్రమాల జాబితానుంచి తొలగించాలని నిర్ణయించారు. అలాగే ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవాల్లో విధిగా వివిధ శాఖల శకటాలు ప్రదర్శించడం ఆనవాయితీ.
అయితే ఈసారి ఆ శకటాల ప్రదర్శనను కూడా తొలగించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ప్రధాన కార్యర్శి అజయ్‌మిశ్రా, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ప్రొటోకాల్ కార్యదర్శి అర్విందర్‌సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.