సాక్షి, కరీంనగర్ : పోలీసుశాఖ తీరుపై రిటైర్డు సీఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనను అవినీతి కేసుల్లో ఇరికించి, తనకు గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు. తన మీద పగ తీర్చుకోవడానికి కొందరు కక్ష కట్టారని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో పనిచేసే వేణుగోపాల్‌తో ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారులకు ఏ హాని లేనప్పటికీ ప్రభుత్వ ఖర్చుతో గన్‌మెన్లను ఏర్పాటు చేశారని, ప్రాణహాని ఉన్న తనకు మాత్రం గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు. హుస్నాబాద్‌లో తన రెండు తుపాకులు మాయమైతే ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదని, తానే ఆ రెండు ఆయుధాలు తీసుకుపోయినట్లు ఆరోపించి విచారణ జరిపారని విమర్శించారు. కాగా విచారణలో తన పొరపాటు లేదని తేలినప్పటికీ.. ఆ రెండు ఆయుధాల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొన్నారు.
ఇప్పటికైనా మాయమైన రెండు ఆయుధాలపై సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో హుస్నాబాద్ సీఐగా పనిచేసినప్పడు అప్పటి సిద్దిపేట సీపీ శివకుమార్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ వాహనం వినియోగించుకొని తన గన్‌మెన్‌ను వాడుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. దీనిపై ఆరోపణలు చేసినందుకు కక్షగట్టి ఆదిలాబాద్‌కు బదిలీ చేశారని తెలిపారు. ఐపీఎస్ అధికారి పనితీరును ప్రశ్నించినందుకు కక్షగట్టి ఏసీబీ కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రజా ధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థలో ఉన్న చీడ పురుగుల పట్ల దృష్టి సారించాలని ఓ సామాన్య పౌరుడుగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment