Bhumayya
-
కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు
వెల్గటూర్(ధర్మపురి): కొడుకు వేధింపులకు విసిగి వేసారిన ఓ దంపతులు అతడిని కొట్టి చంపారు. జగి త్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకార.. రాంనూర్‌కు చెందిన కొదురుపాక భూమయ్య–రాజమ్మ దంపతులు. వీరికి మహేశ్ (35)అనే ఒక కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉన్నారు. భూమయ్య సింగరేణి సంస్థలో కార్మికుడిగా పనిచేస్తూ గోదావరిఖనిలో నివాసం ఉండేవాడు. ఉద్యోగ విరమణ చేశాక స్వగ్రామం రాంనూర్ వచ్చి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులు, భార్యతో మహేశ్ గొడవపడుతున్నాడు. ఈనెల 20న తనకు రూ.200 కావాలని తండ్రి భూమయ్యను మహేశ్ అడిగాడు. అయితే భూమయ్య ఇవ్వకపోవడంతో గొడవకు దారితీసింది. గొడవ పెద్దది కా వడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కౌలు దారు శేఖర్‌తో కలసి మహేశ్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడి లో అతని కాళ్లు, చేతులు విరిగి తీవ్రరక్తస్రావమైంది. తొ లుత జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. -
సీఎంకు మాజీ సీఐ దాసరి భూమయ్య బహిరంగ లేఖ!
సాక్షి, కరీంనగర్: రిటైర్డు డీఎస్పీ, ప్రస్తుతం ఎస్ఐబీలో పనిచేస్తున్న వేణుగోపాల్‌రావుతో పాటు, హైదరాబాద్‌కు చెందిన ఎక్కటి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని రిటైర్డు సీఐ, పీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ పంపారు. బుధవారం భూమయ్య తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసు అధికారిగా విధి నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేసిన తనకు అప్పటి ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు, రివార్డులు ఇచ్చాయని, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌తో పాటు నలుగురు గన్మెన్లను ఇచ్చిందని గుర్తుచేశారు. పోలీసుశాఖలో అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండి, విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించడం వల్ల రిటైర్డు డీఎస్పీ వేణుగోపాల్‌రావుతో పాటు కొంత మంది తనపై కక్ష కట్టారని ఆరోపించారు. హుస్నాబాద్ పోలీసుస్టేషన్లో మాయమైన తుపాకుల కేసులో తనను ఇరికించి మనోవేదనకు గురి చేశారన్నారు. హుస్నాబాద్ తుపాకుల కేసు విషయం తేటతెల్లమైందని గుర్తు చేశారు. ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయాలని తనను 2018 సంవత్సరంలో ఏసీబీ కేసులో ఇరికించి జైలుపాలు చేశారని, ఆ కేసు కోర్టు పరిధిలో ఉందని నిర్దోషిగా బయటపడుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసు ఇన్ఫార్మర్ అయిన హైదరాబాద్‌కు చెందిన ఎక్కటి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తి తనపై హైదరాబాద్‌లో చైతన్యపురి పోలీసుస్టేషన్లో మరోకేసు నమోదు చేయించారని, కట్టుకథలు అల్లుతూ తనను ఎలాగైనా అంతమొందించాలని పోలీసు అధికారి వేణుగోపాల్‌రావు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని చంపేందుకు తాను సుపారీ ఇచ్చి కొందరిని పంపించానని, వాళ్లు తనకు లొంగిపోయారని జైపాల్‌రెడ్డి చెప్పడాన్ని చూస్తుంటే ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేశారు. నక్సలైట్లకు టార్గెట్‌గా ఉండి ప్రభుత్వ పక్షాన ఉన్న తనకు గన్మెన్లను తొలగించడమే కాకుండా ఏసీబీ కేసు నమోదైందనే సాకుతో తన గన్ లైసెన్స్‌ను సైతం రద్దు చేశారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డి వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయని, అతనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని నిరాయుధుడైన తాను ఎలా చంపగలనని ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డిని పోలీసులే అంతమొందించి, ఆ నేరాన్ని తనపై నెట్టే ప్రమాదం ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలకు సూత్రధారి, పాత్రధారి అయిన వేణుగోపాల్‌రావును వెంటనే ఎస్ఐబీ ఉద్యోగం నుంచి తొలగించి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియాకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
రిటైర్డ్ సీఐ భూమయ్య సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, కరీంనగర్ : పోలీసుశాఖ తీరుపై రిటైర్డు సీఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనను అవినీతి కేసుల్లో ఇరికించి, తనకు గన్మెన్లను తొలగించారని ఆరోపించారు. తన మీద పగ తీర్చుకోవడానికి కొందరు కక్ష కట్టారని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో పనిచేసే వేణుగోపాల్‌తో ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారులకు ఏ హాని లేనప్పటికీ ప్రభుత్వ ఖర్చుతో గన్మెన్లను ఏర్పాటు చేశారని, ప్రాణహాని ఉన్న తనకు మాత్రం గన్మెన్లను తొలగించారని ఆరోపించారు. హుస్నాబాద్‌లో తన రెండు తుపాకులు మాయమైతే ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదని, తానే ఆ రెండు ఆయుధాలు తీసుకుపోయినట్లు ఆరోపించి విచారణ జరిపారని విమర్శించారు. కాగా విచారణలో తన పొరపాటు లేదని తేలినప్పటికీ.. ఆ రెండు ఆయుధాల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మాయమైన రెండు ఆయుధాలపై సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో హుస్నాబాద్ సీఐగా పనిచేసినప్పడు అప్పటి సిద్దిపేట సీపీ శివకుమార్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ వాహనం వినియోగించుకొని తన గన్‌మెన్‌ను వాడుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. దీనిపై ఆరోపణలు చేసినందుకు కక్షగట్టి ఆదిలాబాద్‌కు బదిలీ చేశారని తెలిపారు. ఐపీఎస్ అధికారి పనితీరును ప్రశ్నించినందుకు కక్షగట్టి ఏసీబీ కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రజా ధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థలో ఉన్న చీడ పురుగుల పట్ల దృష్టి సారించాలని ఓ సామాన్య పౌరుడుగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. -
ఖాకీలు కలబడ్డారు...
వీడియో పుటేజీల్లో నిక్షిప్తం మామూళ్ల పంపకాల్లో తేడాతో వివాదం విచారణ జరిపిన సీఐ.. ఎస్పీకి నివేదిక చొప్పదండి : చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ కొట్టుకున్నారు. ఇతర పోలీసులు వారించినా వినకుండా తాగిన మైకంలో బూతులు తిట్టుకుంటూ ముష్టిఘాతాలకు దిగారు. మామూళ్ల పంపకంలో వచ్చిన తేడాతో మాటామాటా పెరిగి వివాదం స్టేషన్లోనే తన్నుకునే వరకు వచ్చింది. రామడుగు పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్ కిష్టయ్య కొన్నాళ్ల కింద చొప్పదండి స్టేషన్‌కు అటాచ్డ్గా వచ్చాడు. ఇక్కడే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భూమయ్యతో కలిసి, ఎస్సై జీపు డ్రైవర్ మల్లారెడ్డి మనుమరాలు పురుడు సందర్భంగా ఆదివారం రాత్రి ఇచ్చిన దావత్‌కు వెళ్లారు. వీరితో మరో పోలీస్ కూడా ఉన్నాడు. ఫుల్‌గా తాగి స్టేషన్‌కు వచ్చిన కిష్టయ్య, భూమయ్యమధ్య స్టేషన్‌కు వచ్చిన మామూళ్లు పంచుకునే విషయంలో వివాదం రాజుకుంది. కిష్టయ్య రామడుగు స్టేషన్ నుంచి వచ్చాడని, అక్కడి మామూళ్లే తీసుకోవాలని భూమయ్య నిలదీయడంతో తన్నులాట వరకు వెళ్లింది. వీరి వీరంగమంతా వీడియో పుటేజీల్లో రికార్డు అయినట్లు సిబ్బంది చెబుతున్నారు. కాగా ఇరువురి ఖాకీల మధ్య జరిగిన గొడవపై సీఐ లక్ష్మీబాబు సోమవారం విచారణ జరిపారు. జరిగిన సంఘటనపై ఎస్పీ శివకుమార్‌కు నివేదిక పంపిస్తామని సీఐ చెప్పారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎక్కం భూమయ్య (46) అనే రైతు అర్థిక ఇబ్బందులతో శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్టు ఏఎస్ఐ రజాక్ తెలిపారు. భూమయ్య తనకున్న ఎకరం పొలంలో సేద్యం చేస్తూ, గ్రామంలో చిన్న చిన్న పనులు చేసేవాడు. సాగు నీరు లేక పొలం ఎండి పోతోందని బాధపడేవాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మోడీ పాలనలోనే అభివృద్ధి
ఎదులాపురం, న్యూస్‌లైన్ : ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ అఖిల భారత కౌన్సిల్ సమావేశాలకు దేశ నలుమూలల నుంచి బీజేపీ సీఎంలు, అగ్రనేతలు, వివిధ జిల్లాల నుం చి అధ్యుక్షులు తరలివచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కౌన్సిల్ సమావేశాల్లో కార్యకర్తలకు, నాయకులకు మార్గనిర్దేశనం చేశారన్నారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగంలో రెండో అంశంగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును పేర్కొనడం జరిగిందని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుం దని, మోడీ పీఎం కావడం ఖాయమన్నారు. మోడీ పరిపాలనలో దేశం వినూత్న రీతిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో 80 శాతం ఉన్న వ్యవసా యం 65 శాతానికి పడిపోయిందని తెలిపారు. జిల్లాలో బొగ్గు, పత్తి విస్తృతంగా ఉన్నప్పటికీ వాటి ఫలాలు జిల్లా కు అందడం లేదన్నారు. త్వరలో జిల్లా మేనిఫెస్టోను విడుదల చేసి రాష్ట్ర, జాతీయ నాయకులకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జిల్లాలో కూడా ఎదగడం ఖాయమని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర మోర్చా రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌నాయక్ మాట్లాడుతూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఎస్టీ రిజర్వేషన్ ఉన్న స్థానాలన్నింటిలో బీజేపీ విజయఢంకా మోగించిందని, ఇది గిరిజనులు బీజేపీని విశ్వసించడానికి నిదర్శనమని పే ర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు నివేదిత వఝే, జిల్లా ఉపాధ్యక్షుడు మడావి రాజు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి సంతోష్, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు రవి, బీజేపీ యువ మోర్చా నాయకుడు విజయ్ పాల్గొన్నారు. -
‘మోడీని ఏ శక్తులూ అడ్డుకోలేవు’
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : భావి ప్రధాని నరేంద్రమోడీయేనని, దీనిని ఏ శక్తులూ అడ్డుకోలేవని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జీలు అయ్యనగారి భూమయ్య, ము రళీధర్గౌడ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కన్యక పరమేశ్వరి ఆలయం లో బీజేపీ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకున్నా బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ప్రకటిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీడబ్ల్యూసీ ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌పై ఎటువంటి మెలిక పెట్టినా బీజేపీ దానికి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఏ సర్వేల్లో చూసిన మోడీ ప్రభంజనమే కనిపిస్తోందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, నియోజకవర్గ ఇన్చార్జి జనగం సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నివేధిత వఝే, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు ఉమాఉత్తర్వార్, నాయకులు తుల రఘుపతి, గన్నోజి విజయ్‌కుమార్, మడావి రాజు, దినేశ్ మటోలియా, జోగు రవి, ఆయా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. మోడీ నాయకత్వంలో ముందుకెళ్తాం.. గుడిహత్నూర్ : బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి మురళీధర్, జిల్లా అధ్యక్షుడు ఏ.భూమయ్య అన్నారు. మండల కేంద్రంలోని శివకల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. నేడు దేశంలో అవినీతి, పేదరికం, అధిక ధరలు, రైతుల ఆత్మహత్యలు రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ అధిగమించి సుపరిపాలన అందించడం కేవలం బీజేపీకే సాధ్యపడుతుందని చెప్పారు. జిల్లాలో లక్షా 50వేల ఎకరాల్లో సోయా, పత్తి పంటలు అతివృష్టితో నాశనం అయ్యూయని భూమయ్య పేర్కొన్నారు. అరుునా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మనస్తాపం చెంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. జిల్లా రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మచ్చాపూర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పండిత్, అరవింద్ పవార్, మడావి లేతీరాం బీజేపీలో చేరారు. జిల్లా నాయకులు మడావి రాజు, డా.కేంద్రే లక్ష్మణ్, నియోజకవర్గ ఇన్చార్జి మాధవ్‌రావ్ ఆమ్టే, కిసాన్ మోర్చా, గిరిజన మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కిష్టారెడ్డి, జైవంత్‌రావ్, మండల అధ్యక్షులు సింధే పరమేశ్వర్, నీలకంఠ్ అప్పా పాల్గొన్నారు.