‘వరి’ంచిన ధాన్య సిరి!
♦ రాష్ట్రంలో రెట్టింపు స్థాయిలో వరి ఉత్పత్తి
♦ 2015–16లో 30 లక్షల టన్నులు..
♦ ఇప్పుడు 63 లక్షల టన్నులు
♦ పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో పెరిగింది. 2015–16 వ్యవసాయ సీజన్‌లో 51.45 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, 2016–17 సీజన్‌లో ఏకంగా 96.36 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. అందులో వరి 2015–16లో 30.47 లక్షల టన్నులు ఉత్పత్తి జరగ్గా.. 2016–17లో ఏకంగా రెట్టింపు స్థాయిని మించి 63.57 లక్షల టన్నులు ఉత్పత్తి కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో ఇంతటి స్థాయిలో వరి పంట చేతికందలేదు 2013–14లో రాష్ట్రం విడిపోక ముందు మాత్రం 66.22 లక్షల టన్నులు, 2014–15లో 45.45 లక్షల టన్నుల వరి పండింది.
విచిత్రమేంటంటే ఖరీఫ్ కంటే కూడా రబీలోనే వరి ధాన్యం రాశులు వెల్లువెత్తడం గమనార్హం. 2016 ఖరీఫ్‌లో 29.18 లక్షల టన్నులు మాత్రమే వరి పంట చేతికి రాగా, రబీలో ఏకంగా 34.39 లక్షల టన్నులు పంట చేతికొచ్చింది. మరోవైపు పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 2015–16లో 2.47 లక్షల టన్నుల పప్పుధాన్యాలు పండగా, 2016–17లో ఏకంగా 5.29 లక్షల టన్నులు ఉత్పత్తి జరగడం గమనార్హం.