సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్‌లో తలపెట్టిన ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి సమీపంలోనే హృదయవిధారక సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉన్నా అటుగా వెళుతున్న ఏ ఒక్కరూ స్పందించలేదు.
వివరాలు.. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తు వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ బైక్(టీఎస్ 07 ఎఫ్‌ఆర్ 6346)పై నుంచి పడిపోయారు. ప్రగతి నివేదన సభకు సమీపంలోనే రావిరాల దారిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 108కి దాదాపు 100కు పైగా ఫోన్‌లు చేసినా స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. గంటన్నరకు పైగా ప్రగతి నివేదన సభకు వెళ్లే వాహనాలను సహాయం చేయమని అడిగినా ఎవరినుంచి సరైన స్పందనరాలేదని పేర్కొన్నారు. చివరకు చేసేదేమీలేక సంతోష్ నగర్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ అబేద్ హుస్సేన్, కానిస్టేబుల్‌లు నవీన్, మధుసూదన్‌లు, స్థానికుల సహకారంతో ట్రాఫిక్ వాహనంలోనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో రక్తం బాగా పోవడంతో ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.
బస్సు ఢీకొని ఒకరు మృతి
వరంగల్ : ప్రగతి నివేదన సభకు బస్సులో బయల్దేరిన బిక్షపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌కు చెందిన బిక్షపతి పెండ్యాల వద్ద బస్సు దిగి మూత్రవిసర్జనకు వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment