
బోసిపోయిన రహదారులు
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో మంగళవారం రాజధాని నగరమైన హైదరాబాద్‌లోని రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. రాత్రింబవళ్లు జనసంచారంతో, వాహనాల రాకపోకలతో హడావిడిగా ఉండే హైదరాబాద్ మహానగరం నిర్మానుష్యమైంది. విశాలమైన రహదారులు, వాటికి ఇరువైపులా బహుళ అంతస్తుల భవనాలు తప్ప జనం జాడ లేదు. బహుశా ఏ బంద్, కర్ఫ్యూ రోజుల్లోనూ ఇలాంటి నిర్మానుష్య వాతావరణం చోటుచేసుకొని ఉండకపోవచ్చు. అన్ని రకాల జనజీవన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు, ఆటోరిక్షాలు పూర్తిగా స్తంభించాయి. ఎంఎంటీఎస్ రైళ్లు నడిచినప్పటికీ ప్రయాణికులు లేక వెలవెలబోయా యి. ప్రతి రోజు 3850 బస్సులతో, సుమారు 32 లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడే సిటీబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ఎప్పుడూ రద్దీగా ఉండే ఆబిడ్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, కోఠి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, నాం పల్లి ప్రాంతాల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కనిపించే వందలాది మంది ట్రాఫిక్ సిబ్బందిలో పదిశాతం మంది కూడా కనిపించలేదు. ప్రయాణికులతో రద్దీగా కనిపిం చే మహాత్మాగాంధీ, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిం చాయి.
దేవాలయాల్లో తగ్గిన భక్తుల తాకిడి
సర్వే ప్రభావం నగరంలోని ప్రముఖ దేవాలయాపై కూడా పడింది. శంక ర్‌మఠ్, బిర్లా మందిర్, సంఘీ టెంపుల్, చిక్కడపల్లిలోని ఆయా దేవాలయాలు, అష్టలక్ష్మి దేవాలయం, భాగ్యలక్ష్మీ టెంపుల్, ఇస్కాన్ దేవాలయంతోపా టు పలు ప్రాంతాల్లోని రామాలయాలు, హనుమాన్ మందిరాల్లో భక్తుల తాకిడి బాగా తగ్గింది.
మార్కెట్లు సైతం..: నగరంలోని రైతు బజార్‌సెంటర్లు, పండ్ల మార్కెట్, పూల మార్కెట్, మహబూబ్‌మెన్షన్, మిరాలంమండి తదితర మార్కెట్లు, పరిసర రహదారులన్ని ప్రతిరోజు కొనుగోలుదారులు, పాదచారుల రద్దీతో ఉంటాయి. సర్వే పుణ్యమా కొత్తపేట, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అల్వాల్, మలక్‌పేట, ఎన్టీఆర్‌నగర్, చార్మినార్, బేగంబజార్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఫలక్‌నూమా, వనస్థలిపురం, సరూర్‌నగర్, రామకష్ణాపురం మార్కెట్ ప్రాంతాలు బోసిపోయాయి. దీంతో ట్రాఫిక్ కనీస స్థాయిలో కూడా లేదు.
సచివాలయం వెలవెల..
సర్వే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం మంగళవారం బోసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడం... ఉద్యోగులు సర్వే విధుల్లో ఉండడంతో అన్ని బ్లాకులు వెలవెలబోయాయి. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో సా ధారణంగా ఎంతోకొంత సందడి కన్పించేది. మంగళవారం పూర్తిగా వెలవెలబోయింది. కేవ లం భద్రతా సిబ్బంది... కొందరు పోలీసులు మాత్రమే కనిపించారు. మంత్రులు, వారి అనుచరులు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులతో సందడిగా ఉండే ‘డి’ బ్లాక్ నిర్మానుష్యంగా కనిపించింది. ఆ బ్లాక్‌లోని అంతర్గత కారిడార్లకు పట్టపగలే తాళాలు వేశారు. ఇదిలా ఉండగా, పక్కనే ఉన్న ఏపీ సచివాలయంలో కొంత సందడి నెలకొంది. ఆ రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో సాయంత్రం వేళ కొందరు అధికారులు వచ్చారు.