సాక్షి, హైదరాబాద్: మురుగునీటి పైప్‌లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న పారిశుద్ధ్య కార్మికుల జీవితాలకు భద్రత, భరోసా నిచ్చేందుకు రోబోలు అందుబాటులోకి వచ్చాయి. కేరళలో ప్రయోగాత్మకంగా కొందరు యువ ఇంజనీర్లు తయారు చేసిన రోబోలు ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల జల బోర్డుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేరళ వాటర్ అథారిటీ ఇప్పటికే ఇలాంటి 50 రోబోలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిసింది. యువ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోన్న జెన్‌రోబోటిక్స్ అనే సంస్థ ఈ రోబోలను తయారు చేసింది. ఈ రోబోకు బ్యాండీకూట్ అనే పేరుపెట్టింది. ఈ అరుదైన రోబోకు పేటెంట్ హక్కులు పొందేందుకు సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. దేశ వ్యాప్తంగా 2014–17 మధ్యకాలంలో మురుగునీటి పైప్‌లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి సుమారు 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాతపడ్డారు. దీంతో తమ ఇంజనీర్ల బృందం ఈ అధునాతన రోబో తయారీకి శ్రీకారం చుట్టి ్టనట్లు మెకానికల్ ఇంజనీర్, జెన్‌రోబోటిక్స్ సీఈఓ విమల్ గోవింద్ అన్నారు. తమ బృందంలో ఐటీ, మెకానికల్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారన్నారు.
ఈ రోబో పని చేస్తుందిలా..
ఈ బ్యాండీకూట్ రోబో తయారీకి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. రోబో బరువు దాదాపు 80 కిలోలు. మ్యాన్‌హోళ్లలో మనుషులు దిగే అవసరం లేకుండా ఈ రోబో శుద్ధి ప్రక్రియ నిర్వహిస్తుంది. మ్యాన్‌హోల్‌లోకి వెళ్లే రోబో విడిభాగాల బరువు 30 కిలోలు. ముందుగా ఈ రోబోకున్న వైరును మురుగు ప్రవాహానికి అడ్డంకులున్న మ్యాన్‌హోల్‌లోకి పంపిస్తారు. దీనికున్న కెమెరా లోపలి పరిస్థితిని ఫొటోలు తీస్తుంది. ఈ ఫొటోలు బయట స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో మురుగు ప్రవాహానికి ఎక్కడ ఆటంకాలున్నాయో తెలుసుకోవచ్చు.
ఆ తర్వాత జెట్‌పైప్ సాయంతో రోబో మ్యాన్‌హోల్‌లోకి వెళ్లి ప్రవాహానికి ఉన్న ఆటంకాలను నిమిషాల వ్యవధిలో తొలగిస్తుంది. మూడు గంటలపాటు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని ఈ రోబో 30 నిమిషాల్లోనే పూర్తిచేస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా ఈ రోబోను ఆపరేట్ చేయవచ్చని చెప్పారు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి సైతం ఈ రోబోలు ఉపయుక్తంగా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రధాని కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని, వీటి పనితీరుపై ప్రజెంటేషన్ సైతం ఇచ్చినట్లు వారు వివరించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ రీసెర్చ్ సైతం ఈ బ్యాండీకూట్ రోబో ఉత్తమమైనదిగా అభివర్ణించిందన్నారు. తమ రోబో విశిష్టతలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ రోబోటిక్స్ రీసెర్చ్ జర్నల్‌లోనూ ప్రచురించారని నిర్వాహకులు తెలిపారు.
మ్యాన్‌హోల్స్ శుద్ధికి రోబో
Published Thu, Feb 22 2018 3:25 AM | Last Updated on Thu, Feb 22 2018 3:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment