సరూర్‌నగర్ : రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం చంపాపేట్‌లోని ఒక ఇంట్లో మత్తు పదార్ధాలను పట్టుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సయ్యద్ మునీరుద్దీన్ తెలిపారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సుక్క నర్సింహగౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నర్సింహగౌడ్ చంపాపేట్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని.. కర్నూలు జిల్లాకు చెందిన గంగాధర్ నుంచి మత్తుమందులను కొనుగోలు చేసి, నగరంలోని ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు జరిపారు. అతని వద్ద నుంచి 11.5 కిలోల అల్ఫ్రాజోలం, 5.5 కిలోల డైజోఫాంను స్వాధీనం చేసుకున్నట్లు సయ్యద్ తెలిపారు. అంతేకాకుండా నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 8వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు మందుల విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా ప్రధాన నిందితుడైన గంగాధర్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.