
రూ. 2 కోట్ల విలువైన పంచలోహ విగ్రహాలు పట్టివేత
కరీంనగర్ క్రైం :
నాలుగున్నర సంవత్సరాలుగా మిస్టరీగా మారిని ముస్తాబాద్ మండలం పోత్గల్ రామాలయ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దొంగతనానికి గురైన నాలుగు విగ్రహాలను స్వాధీనం చేసుకుని ఓ దొంగను అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ శివకుమార్ వివిధ కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల మండలం గండిలచ్చపేటకు చెందిన బుర్రసాయిలు, బొమ్మనగారి తిరుపతి, లోకని ఎల్లయ్య ముఠాగా ఏర్పడ్డారు. ఎల్లయ్య పలు కేసుల్లో నిందితుడు. జైలుకూ వెళ్లివచ్చాడు.
పోత్గల్ రామాలయంలోని 18వ దశాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, గోదాదేవి పంచలోహ విగ్రహాలను 2010 జనవరి 21వ తేదీన దొంగలించారు. అనంతరం వాటిని స్వగ్రామానికి తరలించి దాచారు. పోలీసుల నిఘా ముమ్మరం కావడంతో వాటిని అమ్మలేదు. ఈ క్రమంలో దొంగల్లో తిరుపతి, ఎల్లయ్య ఇద్దరు మృతిచెందారు. బతికి ఉన్న బుర్రసాయిలు ఇటీవలే విగ్రహాలను అమ్మడానికి ప్రయతన్నాలు ప్రారంభించాడు. సమాచారం అందుకున్న సీసీఎస్ సీఐ మాధవి, ఎస్సైలు సృజన్‌రెడ్డి, ఉపేందర్, కానిస్టేబుళ్లు రాజేశ్, నాయక్, సాగర్‌లు శనివారం ఉదయం సిరిసిల్లలోని గండిలచ్చకపేటలోని బుర్రసాయిలు అదుపులోకి తీసుకుని విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. సాయిలును రిమాండ్‌కు తరలించారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
క్రమశిక్షణ లేని జీవితం.. బాధ్యతరాహిత్యంతో జవాన్ ఉద్యోగం కోల్పోయి నేరాలకు పాల్పడ్డాడు. రెండుసార్లు జైలుకు వెళ్లివచ్చినా ప్రవర్తనలో మార్పురాలేదు. అంతేకాదు జైళ్లో పరిచయమైన వ్యక్తితో బయట చోరీలకు పాల్పడ్డాడు. సీసీఎస్ పోలీసులు పట్టుకుని కటకటాలపాలు చేశారు. కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన చల్లా మహేశ్‌రెడ్డి అలియాస్ మహేశ్ 2004లో ఆర్మీలో జవాన్‌గా ఉద్కోగంలో చేరాడు. 2007లో వరంగల్ జిల్లాలోని కేసముద్రంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.
అనంతరం ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అనంతరం బెయిల్‌పై విడుదలై పలు చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలు తరలించారు. మల్యాల మండలంలోని బల్వంతపూర్ గ్రామానికి చెందిన బొమ్మకంటి శ్రావణ్‌తో పరిచమైంది. 2013 జైలు నుంచి విడుదల తర్వాత మహేశ్ కలిసి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో 11 నేరాలకు పాల్పడ్డారు. చోరీ చేసిన బంగారాన్ని అమ్మేబాధ్యత శ్రావణ్‌కు అప్పగించాడు. బంగారం అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో రూరల్ సీఐ న రేందర్, సీసీఎస్ సీఐ మాధవి, రూరల్ ఎసై శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో అపోలో రీచ్‌వద్ద శనివారం ఉదయం పట్టుకున్నారు. వారి నుంచి రూ. 7.80 లక్షల విలువైన 52 తులాల బంగారం, 86 తులాల వెండి ఆభరణాలు, రూ. 55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
12 గంటల్లోనే దొంగ పట్టివేత
శుక్రవారం రెండు చోరీలు చేసిన వెంటనే 12 గంటల్లోనే జిల్లా పోలీసులు దొంగను పట్టుకున్నారు. మెట్‌పల్లిలోని బోయవాడకు చెందిన శేక్ ఇమ్రాన్ అలియాస్ ముకేశ్ పాత నేరస్తుడు. జైలుకు వెళ్లి నాలుగు రోజుల క్రితమే బయటకు వచ్చాడు. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెట్‌పల్లిలో రోడ్డు వెంట వెళ్తున్న తాడురి గంగమ్మ నుంచి తులం చైన్ చోరీ చేశాడు. రాత్రి 10 గంటలకు దైవరాశెట్టి గౌరమ్మ ఇంట్లో చొరబడి ఆమెపై ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు చోరీచేశాడు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు 12 గంటల్లోనే చోరీ చేసిన శేక్ ఇమ్రాన్ పట్టుకుని ఆయన నుంచి 8 తులాల బంగారం రివకరీ చేశారు.
పోలీసులకు రివార్డులు...
జిల్లాలో జరిగిన పలు చోరీ కేసులు ఛేదించిన రూరల్ సీఐ నరేందర్, సీసీఎస్ సీఐ మాధవి, మెట్‌పల్లి సీఐ రాజశేకఖరరాజు, సీసీఎస్ ఎస్సైలు సృజన్‌రెడ్డి, ఉపేందర్, కరీంనగర్ రూరల్ ఎస్సై శ్రీనివాస్, మెట్‌పల్లి ఎస్సై రాజేశ్, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుళ్లు సలీం, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, సాగర్, రూరల్ కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, బషీర్, రవినాయక్, అశోక్‌ల, మెట్‌పల్లి కానిస్టేబుళ్లు నసీర్‌ఖాన్, అశోక్‌కు ఎస్పీ శివకుమార్, అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డిలు రివార్డులు ప్రకటించారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు.