చెరువుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు
చెరువుల మరమ్మతులకు ఈ ఏడాదికి 2వేల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. చెరువులు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి మూలాలు. తెలంగాణ నీటిపారుదల అవసరాలను తీరుస్తున్నవి ఇవే. అయితే మైనర్ ఇరిగేషన్ పేరిట ఉమ్మడి రాష్ట్రంలో వీటిని ధ్వంసం చేశారు. దాంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. 1960 ప్రాంతంలో కూడా చెరువుల ద్వారానే 60 శాతం వరకు వ్యవసాయం సాగేది. కానీ తర్వాత చెరువుల్లో పూడిక కూడా తీయలేదు.
దాంతో కేవలం 8 శాతం భూములు మాత్రమే చెరువుల కింద ఉన్నాయి. ఇప్పుడు 80 శాతం వ్యవసాయం కేవలం కరెంటు మోటార్ల కిందే జరుగుతోంది. దీన్ని తగ్గించడానికి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరిస్తాం. 45 వేలకు పైగా చెరువులను వచ్చే ఐదేళ్లలో పునరుద్ధరిస్తాం. ప్రతి ఏటా 9వేల చెరువులు బాగుచేస్తాం. ఈ ఏడాది 9 వేల చెరువులకు 2 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యప్రకారం పూర్తిచేయాలి. మొత్తం నీటిపారుదల రంగానికి 6,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.