
ఆకాశంలో సగం.. కళ్యాణలక్ష్మికి రూ. 230 కోట్లు
మహిళల సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ''సమాజంలో సగభాగం మహిళలు. అమ్మాయి అంటే భారంగా పరిగణిస్తున్నారు. ఆడపిల్లలు పుట్టగానే చంపేయడానికి కూడా వెనకాడట్లేదు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చాలా కష్టం. అందుకోసం వారికి 51 వేల రూపాయల చొప్పున అందించాలని ప్రతిపాదిస్తున్నాం. ఈ పథకానికి 'కళ్యాణలక్ష్మి' అని పేరు పెడుతున్నాం. మొత్తం దీనికోసం ఎస్సీలకు రూ. 150 కోట్లు, ఎస్టీలకు రూ. 80 కోట్ల వంతున మొత్తం 230 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.
మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది. మహిళల రక్షణ, దేశభద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మహిళా అధికారులతో నియమించిన కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఈవ్ టీజింగ్ నిరోధానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేశాం. మహిళల భద్రతకు 10వేల కోట్లు కేటాయించాం.'' అని ఆయన అన్నారు.