తనిఖీల్లో రూ.24.68 లక్షలు స్వాధీనం | Rs .24.68 lakh seized in Checking | Sakshi
Sakshi News home page

తనిఖీల్లో రూ.24.68 లక్షలు స్వాధీనం

Published Fri, Mar 14 2014 11:18 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Rs .24.68 lakh seized in Checking

పరిగి, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వేర్వేరు చోట్ల పోలీసులు రూ. 24.68 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో 2.84 కిలోల వెండి నగలు పట్టుకున్నారు. పరిగిలో అధికంగా 15 లక్షలు పట్టుకున్నారు.

 పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. సాయంత్రం పరిగిలోని గంజ్ రోడ్డు వైపు నుంచి నంబర్ 02 ప్రభుత్వ ఉన్నత పాఠశాల వైపు కొందరు వ్యక్తులు ఓ బైకుపై అధిక మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి ముగ్గురు కానిస్టేబుళ్లతో రెండు బైక్‌లపై వారిని వెంబడించారు. స్కూల్ వెనుక చిన్నదారి గుండా వెళ్తున్న వారిని పట్టుకున్నారు.

పరిగికి చెందిన ఎంఏ రహీం, దోమ మండలం శివారెడ్డిపల్లికి చెందిన ఆహ్మద్‌ఖాన్‌లు రూ. 15 లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించి నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా తాము కాంట్రాక్టర్లమని రోడ్డుపనులకు సంబంధించి మెటీరియల్‌తో పాటు కూలీలకు చెల్లించేందుకు బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకెళ్తున్నట్లు అహ్మద్‌ఖాన్, రహీం పోలీసులకు తెలిపారు. వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్విలెన్స్ టీం సభ్యుడు సంగప్పకు సదరు డబ్బులను అప్పగించారు. సమావేశంలో ట్రెయినీ డీఎస్పీ సౌజన్య, పోలీసు సిబ్బంది పాండు, అంజనేయులు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

 మరో ఘటనలో రూ. 2.5 లక్షలు
 పరిగి మండలం రాఘవాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ. 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన అశోక్ షాద్‌నగర్ నుంచి పరిగికి స్విఫ్ట్ కారులో వెళ్తున్నాడు. అతడి కారులో ఉన్న రూ. 2.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును స్టాటిక్ సర్విలెన్స్ టీంకు అప్పగించారు.

 ఘట్‌కేసర్‌లో రూ.5. 38 లక్షలు  
 ఘట్‌కేసర్: వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘట్‌కేసర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించి రూ. 5.38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌కేసర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్కూటర్ డిక్కీలో ఈ డబ్బులు పట్టుబడ్డాయి. నగదు పెట్రోల్ పంపునకు చెందినవి ఆయన పోలీసులకు చెప్పాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును ఐటీ అధికారులకు అప్పగించారు.   

 అజీజ్‌నగర్ చౌరస్తాలో రూ.1.8 లక్షలు..
 మొయినాబాద్: హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మండల పరిధిలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద శుక్రవారం పోలీసుల తనిఖీల్లో ఓ కారులో రూ.1.8 లక్షలు పట్టుబడ్డాయి. వివరాలు.. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన తిరుమలరెడ్డి తన కారులో చేవెళ్ల వైపునకు వెళ్తున్నాడు. వాహనంలో ఉన్న రూ.1.8 లక్షలను మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తాను మహాలక్ష్మి బిల్డర్స్ యజమానిని అని,  భూమి కొనుగోలుకు సంబంధించి నగరంలోని పేట్‌బషీరాబాద్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లో శుక్రవారం ఉదయం రూ.5 లక్షలు డ్రా చేశానని, అందు లో నుంచి రూ.1.8 లక్షలు తీసుకెళ్తున్నట్లు అతడు పోలీసులకు తెలిపాడు. భూమికి సంబంధించిన పత్రాలు కూడా చూపించాడు. డబ్బుకు సంబంధించి అన్ని ఆధారాలు చూపిస్తేనే తిరిగి అప్పగిస్తామని, లేదంటే ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని పోలీసులు తిరుమలరెడ్డికి స్పష్టం చేశారు.

 ముడిమ్యాల చెక్‌పోస్టులో 2.84 కిలోల వెండి పట్టివేత
 చేవెళ్ల రూరల్: పోలీసుల తనిఖీల్లో రూ. 1.5 లక్షలు విలువ చేసే 2.84 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. చేవెళ్ల పోలీసుల కథనం ప్రకారం.. పరిగి మండల కేంద్రానికి చెం దిన మదులాపురం రవికుమార్ స్థానికంగా వెండి ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన నగరం నుంచి పరిగికి బస్సులో వెళ్తున్నాడు.

మండలంలోని ముడిమ్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో అతడి వద్ద ఉన్న బ్యాగులో 2.84 కిలోల వెండి ఆభరణాలు(పట్టాలు, రెండు వెండి బిస్కెట్లు) ఉన్నట్లు గుర్తించారు. తన దుకాణంలో అమ్ముకునేందుకు హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు రవికుమార్ పోలీసులకు చెప్పాడు. అతడి వద్ద ఓ తెల్లకాగితం రశీదు మాత్రమే ఉంది. దీంతో పోలీసులు అనుమానించి అతడిని ఠాణాకు తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు  ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం వెండి ఆభరణాలను కమర్షిల్ టాక్స్ శాఖ అధికారులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement