పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం దుబ్బాక డిపో ఎదుట కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టారు.
దుబ్బాక (మెదక్ జిల్లా) : పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం దుబ్బాక డిపో ఎదుట కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరాహార దీక్షలను ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ జోనల్ అధ్యక్షులు జీ. శేషన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో అద్దె బస్సుల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ, సీసీఎస్ లోన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2012, 13, 14 సంవత్సరాలకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇవ్వాలని, 01.07.2015 నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన డీఏ ఏరియర్స్‌ను విడుదల చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ మెకానిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ చేయడం లేదన్నారు. సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ యాజమాన్యం ముందు పెట్టిన సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులతో కలిసి రిలే దిక్షలను నిరవధిక దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. కార్మికుల దీక్షలకు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మచ్చ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆస శరభయ్య తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ దీక్షల్లో ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి పీఎస్ నారాయణ, అధ్యక్షులు రవీందర్, నాయకులు రమేశ్, బాలమల్లు, అశోక్, నర్సింహులు, కనకయ్య, సుధాకర్, ఎల్లయ్య, సత్తయ్య, నాంపల్లి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.