రవాణా మంత్రే ఆర్టీసీకి మైనస్..
హైదరాబాద్ : ఆర్టీసీని ప్రయివేట్పరం చేయటానికి కుట్ర జరుగుతోందని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సమ్మె కొనసాగటానికి ఆర్టీసీ ఎండీ వైఖరే కారణమని వారు ఆరోపించారు. ఎండీ సాంబశివరావు నిరంకుశంగా వ్యవహరించారని, ఆయనతో చర్చలు జరిపేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లా ఎండీ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.
ఇక తెలంగాణ రవాణామంత్రి మహేందర్రెడ్డే ఆర్టీసీకి మైనస్ అని టీఎంయూ నేత అశ్వాద్ధామరెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెకు హరీష్ రావు మద్దతు తమకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని టీఎంయూ నేతలు కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, లేకుంటే సోమవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.