కులవృత్తుల్లో  ఆర్టీసీ సిబ్బంది | RTC Employees Works Caste Occupations In Karimnagar | Sakshi
Sakshi News home page

కులవృత్తుల్లో  ఆర్టీసీ సిబ్బంది

Published Fri, Nov 15 2019 8:34 AM | Last Updated on Fri, Nov 15 2019 8:34 AM

RTC Employees Works Caste Occupations In Karimnagar - Sakshi

ఆర్టీసీ సిబ్బందికొన్ని రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఓవైపు నిరసనల్లో పాల్గొంటూనే కుటుంబ పోషణకు కుల వృత్తిని ఎంచుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ యాజమాన్యం జీతాలు నిలిపివేయడంతో ఆర్థిక ఇబ్బందులుపడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఇలా పనులకు వెళ్తున్నారు.

ఇస్త్రీ పనిలో డ్రైవర్‌
తిమ్మాపూర్‌(మానకొండూర్‌): తిమ్మాపూర్‌ మండలం గొల్లపల్లికి చెందిన రాందండ రాజమల్లయ్య కరీంనగర్‌– 1డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా వేతనాలు లేకపోవడం, కుటుంబపోషణ భారంగా మారడంతో లాండ్రీషాపు పెట్టుకుని బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. పిల్లల స్కూల్‌ ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని వాపోయాడు.  ఇన్సూరెన్స్, ఈఎంఐ వాయిదాలు కూడా నిలిపేశామన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికులు సమ్మె విరమించేలా చూడాలని కోరారు. 

ఆర్టిస్ట్‌గా కండక్టర్‌
శంకరపట్నం (మానకొండూర్‌): హుజురాబాద్‌ ఆర్డీసీ డిపోలో కండక్డర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌ గురువారం కేశవపట్నం  పంచాయతీ బోర్డుపై రంగులు వేశారు. కుటుంబపోషణకు ఆర్టిస్ట్‌గా మారాడు. గతంలో గోడలపై రాతలు రాసిన అనుభవం ఉండడంతో కష్టకాలంలో ఉపాధి పొందుతున్నాడు. వచ్చిన డబ్బుతో బియ్యం, నిత్యవసర సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

వ్యవసాయ పనుల్లో కండక్టర్‌ 
గంగాధర(చొప్పదండి): మండలంలోని కురిక్యాల గ్రామానికి చెందిన కండక్టర్‌ మడుపు మల్లారెడ్డి కొద్దిరోజులుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. కౌలుకు ఇచ్చిన వ్యవసాయ భూమిలో వరి కోయించి, ఎండకు ఆరబోస్తూ, సాయంత్రం కుప్ప పోస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వేడుకుంటున్నాడు.

కూలీగా కోచ్‌ బిల్డర్‌
కరీంనగర్‌కు చెందిన కనుకుంట్ల కరుణాకర్‌ ఆర్టీసీ డిపోలో కోచ్‌బిల్డర్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా జీతంరాక కరీంనగర్‌లోని రేకుర్తిలో బిల్డింగ్‌ కూలీ పనికి వెళ్లాడు. రోజుకు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయని దీంతో కుటుంబ పోషణకోసం అవసరానికి ఉపయోగపడుతున్నాయని కరుణాకర్‌ తెలిపారు.  
– సాక్షి, ఫొటోగ్రాఫర్, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement