గ్రామాల అభివృద్ధికి సీఎం బాటలు
- తెలంగాణకే ఆదర్శనం మహమ్మద్‌నగర్
- జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు
నిజాంసాగర్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేస్తున్నారని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మహమ్మద్‌నగర్ గ్రామం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధేతో కలిసి బుధవారం ఆయన గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ సీమాంధ్రుల పాలన వల్ల అభివృద్ధి చేయలేకపోయానని, ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాన్ని సుందరంగా అభివృద్ధి చేశానని చెప్పారు.
మొదటి నుంచి గ్రామస్తులు తన వెన్నంటి ఉండబట్టే కీలక పదవిలో నిలిచానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌సింధే సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపట్టానన్నారు. ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ఆసరా పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులకు నెలకు రూ.1000 పింఛను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్జుకింది సునంద, ఎంపీటీసీ సభ్యురాలు కుర్షిద్‌ఉన్నిసా బేగం, టీఆర్‌ఎస్ నాయకులు వినయ్‌కుమార్, దుర్గారెడ్డి, మోహన్‌రెడ్డి, మోయిస్, విఠల్, పండరి, సాదుల సత్యనారాయణ, చందర్ తదితరులు పాల్గొన్నారు.