
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పాన్‌గల్ : వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గురువారం ఆయన అన్నారం, చిక్కేపల్లి గ్రామాల్లో రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు, నూతన పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్ల మాట్లాడుతూ.. సీఎం దేశానికి వెన్నెముక లాంటి రైతుల ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. రబీ, ఖరీఫ్‌లో రూ.8వేలు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నారని చెప్పారు.
పాసు పుస్తకాలను కుదువ పెట్టుకోకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పెట్టుబడి సాయం, కొత్త పాసుపుస్తకాలు తెలంగాణ దేశానికి దిక్సూచి లాంటివన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 58లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు జూన్ 2వ తేదీ నుంచి రైతుకు ప్రమాద బీమా కింద రూ.ఐదులక్షలు చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. 70ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తుందని కొనియాడారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
రైతుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ ఆయన చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. బంగారు తెలంగాణ అభివృద్ధిలో పార్టీలకతీతంగా అందరు సహకరించాలని మంత్రి జూపల్లి కోరారు. కార్యక్రమంలో జేసీ చంద్రయ్య, ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మహేష్‌నాయుడు, నర్సింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment