
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక మరో అరుదైన ఘనత సాధించింది. కలర్‌ఫుల్‌గా వెలుగులు విరజిమ్ముతూ రంగుల ముద్రణా నాణ్యతలో తనకు సాటిలేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ)లో సభ్యత్వాన్ని సాధించింది. 2018–20 సంవత్సరాలకుగాను సాక్షి ఈ ఘనతను సాధిం చినట్లు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ (వాన్–ఇఫ్రా) శుక్రవారం ప్రకటించింది. ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం సాక్షి మీడియా గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లోని 22 ముద్రణా కేంద్రాల తరఫున పోటీలో పాల్గొంది. అన్ని ప్రింట్ సెంటర్లకు ఐసీక్యూసీలో విజయవంతంగా సభ్యత్వాన్ని సాధించి రికార్డు సృష్టించింది.
ఒక వార్తా పత్రిక తమ ముద్రణా కేంద్రాల న్నింట్లోనూ అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం పోటీ పడి దానిని సాధించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. వాన్–ఇఫ్రా ఐసీక్యూసీ పోటీలో ఏకంగా 22 ఎడిషన్లలో సభ్యత్వాన్ని సాధించిన ప్రపంచంలోని ఏకైక సంస్థ సాక్షి మాత్రమే. వార్తా పత్రికలు, పబ్లిషింగ్ సంస్థలు ముద్రణలో ఎంతవరకు నాణ్యతను పాటిస్తున్నాయో శాస్త్రీయంగా పరిశీలిస్తూ వస్తోంది వాన్ ఇఫ్రా. 1994 నుంచి ముద్రణకు సంబంధించి పోటీలు నిర్వహిస్తూ ముద్రణా ప్రమాణాలకు అనుగుణంగా పాయిం ట్లు ఇస్తోంది. ఈ పోటీలో పాల్గొని ముద్రణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించిన దినపత్రికలకు ఐసీక్యూసీలో సభ్యత్వాన్ని ఇస్తోంది.
పాఠకుల్ని, అడ్వర్టయిజర్లను ఆకట్టుకోవాలం టే ముద్రణలో నాణ్యతా ప్రమాణాలు అత్యంత ముఖ్యమని భావించిన ఇఫ్రా ఈ పోటీ ప్రారంభించింది. రంగుల ముద్రణలో నాణ్యతను పరీక్షించేందుకు ఇఫ్రా ప్రతిపాదించిన ‘క్యూబాయిడ్‘ను వార్తాపత్రికలు తమ రెగ్యులర్ ఎడిషన్లలో నెలకు 5 రోజులచొప్పున 3 నెలలపాటు ముద్రించి.. ఆ ప్రతుల్ని వాన్–ఇఫ్రాకు పంపించాలి. ఆ సంస్థ నిపుణులు ముద్రణలో నాణ్యతను అంచనా వేసి సభ్యత్వాన్ని ఇస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే కార్యక్రమంలో సాక్షికి సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment