మా ఆవిడే నా బలం | Sakshi Personal Time Interview With Jogu Ramanna | Sakshi
Sakshi News home page

మా ఆవిడే నా బలం

Published Sun, May 26 2019 8:08 AM | Last Updated on Sun, May 26 2019 8:08 AM

Sakshi Personal Time Interview With Jogu Ramanna

కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే జోగు రామన్న

మాది సామాన్య వ్యవసాయ కుటుంబం. నాగలిపట్టి అరక దున్నేవాడిని. రాత్రివేళ పొలం వద్దకు వెళ్లి నీళ్లుపెట్టేవాడిని. పెళ్లయిన తర్వాత మా ఆవిడే నా బలమైంది. అన్ని పనులూ ఆమె చూసుకునేది. పిల్లల పెంపకం.. వారి చదువులు.. బాగోగులు అన్నీ ఆమె. ఇద్దరం కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లం. అన్ని పనులూ మేమే చేసుకునేటోళ్లం. ఇప్పుడు యోగాతోనే ఉదయం ప్రారంభిస్తా.. పొద్దంతా ప్రజాసేవ.. సాయంత్రమైందంటే చాలు మనవళ్లతో ఆడుకుంటా. కబడ్డీ, వాలీబాల్‌ అంటే ప్రాణం. ఇప్పటికీ ఆడాలని ఉంటుంది.. అని అంటున్నారు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న. ‘సాక్షి’ పర్సనల్‌ టైం ఇంటర్వ్యూలో ఆయన తన మనోగతాన్ని ఆవిష్కరించారు. 

ఆదిలాబాద్‌టౌన్‌ :  మాది జైనథ్‌ మండలం దీపాయిగూడ గ్రామం. మా నాన్న జోగు ఆశన్న, అమ్మ భోజమ్మ. ముగ్గురం అన్నదమ్ములం. ఒక అక్క. అన్న పోతారెడ్డి, తమ్ముడు వెంకన్న, అక్క పెంటక్క. మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉమ్మడి కుటుంబంగా 34 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు దీపాయిగూడలో చదివి. 6 నుంచి 10వ తరగతి వరకు జైనథ్‌కు నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఇంటర్‌ బోథ్‌లో అడ్మిషన్‌ తీసుకున్న తర్వాత అక్కడినుంచి ఆదిలాబాద్‌కు మారాను. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం భైంసాలో పూర్తిచేసిన. ఆదిలాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి.. తృతీయ సంవత్సరంలో మానేసిన.


మనువడితో రామన్న దంపతులు 

మా గ్రామమైన దీపాయిగూడకు చెందిన రమతో 1983 మే 21న పెళ్లయ్యింది. నా భార్య రమతో కలిసి వ్యవసాయ పనులు చేసిన. చేనులో దుక్కిదున్నడం, మందు పిచికారీ చేయడంతోపాటు అన్ని పనులు చేశాను. అలాగే బాల గణేశ్‌ మండల అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు మొదలయ్యాయి. పెళ్లి కాకముందే పాఠశాల కమిటీ చైర్మన్‌ అయ్యా. బడికి డుమ్మా కొట్టి మానాన్నతో కలిసి ఆవులు, గేదెలు మేపేవాడిని. గ్రామంలో స్నేహితులతో సరదాగా గిల్లిదండా ఆడేవాన్ని. మాకు ఇద్దరు కుమారులు. ప్రేమేందర్, మహేందర్‌. పెద్ద కుమారుడు మహేందర్‌కు ఓ కుమారుడు అద్వైత్, చిన్న కుమారుడు ప్రేమేందర్‌కు ఒక కుమారుడు రిదాజ్‌ ఉన్నారు. నేను శివభక్తుడిని. గుడికి వెళ్లకపోయినా మా ఆవిడ మాత్రం తప్పకుండా ఆలయానికి వెళ్లి పూజలు చేసేది. పిల్లల పెంపకం.. వారి చదువులు.. బాగోగులు.. బంధువులు.. ఇలా అన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఆమె సహకారంతోనే ప్రస్తుతం నేను ఈ స్థాయికి చేరి. కుటుంబసభ్యులకు సమయాన్ని ఇవ్వకపోయినా వారు నన్ను అర్థం చేసుకుంటారు. ప్రజాసేవే నాకు సర్వస్వం. జోగు ఫౌండేషన్‌ ద్వారా ప్రజలకు సేవ చేయడం తృప్తినిస్తోంది. విద్య, వైద్యం, చావు, పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు నాకు తోచిన సహాయం చేస్తుంటా. 

వ్యవసాయ పనుల్లో..
వ్యవసాయ పనులన్నీ చేసేవాడిని. రాత్రివేళల్లో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లేవాడిని. వరి తప్ప అన్ని పంటలు పండించాం. మా చేనులో పత్తి, సోయా, చెరుకు, బెండ, టమాటా, సన్‌ఫ్లవర్, పసుపు, అరటి, నిమ్మ, తర్బూజా, మోసంబి, పట్టుపురుగుల పెంపకం, తదితర పంటలు సాగు చేశాం. 1994 సంవత్సరంలో సుకుమార్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో సోయాబీన్‌ను జిల్లాకు పరిచయం చేశారు. 30ఎకరాల సోయాబీన్‌ పంట వేశాను. నా భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేపట్టాను. 


యోగా చేస్తూ..

యోగాతో ఉదయం ప్రారంభం
రోజంతా బిజీగా ఉంటా. ఆరోగ్య రీత్యా యోగా జీవితంలో భాగమైంది. ఉదయం 5 గంటలకు లేవగా>నే కాలకృత్యాలు తీర్చుకుని గంట యోగా చేస్తా. ఆ తర్వాత రెడీ కావడం.. ఏదో గ్రామానికి వెళ్లడం.. నిత్యకృత్యం. సాయంత్రం ఇంటికొచ్చాక ఇద్దరు మనువళ్లతో సరదాగా గడుపుతా. నేను స్వతహాగా వాలీబాల్, కబడ్డీ ప్లేయర్‌ను. 

ఆదిలాబాద్‌లోనే మా అడ్డా..
నా చిన్ననాటి స్నేహితులు మోహన్‌రెడ్డి, పోతారెడ్డి, వసంత్‌రెడ్డి, భీంరెడ్డి తదితరులు 40 మంది ఉండేవాళ్లం. ఇప్పటికీ సంవత్సరానికి రెండుమూడు సార్‌లైనా కలిసి గెట్‌టుగెదర్‌ ఏర్పాటు చేసుకుంటాం. మా ఊరిలో యువకుడిగా ఉన్నప్పుడు ఎవరైన శుభకార్యాలు ఉంటే అందరి ఇళ్లకు వెళ్లి గంజులు, తదితర సామగ్రి జమచేసి సహాయం అందించే వాళ్లం. ఆ తర్వాత ఆదిలాబాద్‌ పట్టణంలోని మా స్నేహితుడికి ఎస్‌ఆర్‌ఎంటీ ట్రాన్స్‌పోర్ట్‌ ఉండేది. అక్కడే మా అడ్డా ఉండేది. ఏ పనిలేకపోయినా దీపాయిగూడ నుంచి వచ్చి కాలక్షేపం చేసి వెళ్లేవాడిని. తరోడ దగ్గర వాగు ఉండేది. ఆదిలాబాద్‌ నుంచి తరోడ వరకు ఒక బస్సు, అక్కడి నుంచి జైనథ్‌ వరకు మరో బస్సు ఉండేది. వర్షాకాలం తరోడా వాగు వద్ద పడవలో దాటేవాళ్లం. ఒక్కోరోజు వాగు వస్తే ఆదిలాబాద్‌లోనే ఉండిపోయేవాడిని. జైనథ్‌ నుంచి మా ఊరికి ఎంత రాత్రయినా కాలినడకతోనే వెళ్లేవాడిని. ఎలాంటి భయం ఉండేది కాదు. మా గ్రామంలో 1986లో డయేరియా వచ్చింది. ఆదిలాబాద్‌ నుంచి డాక్టర్‌ను తీసుకెళ్లి ఐదురోజులు వైద్య పరీక్షలు చేయించాం. యువకుడిగా ఉన్న సమయంలో ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసేవాన్ని. ఆ అనుభూతే వేరు. ఇప్పటికీ ప్రజాసేవ చేసేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement