
ఇక బడిబాట..!
చిత్తు కాగితాల్లో బాల్యం కథనానికి స్పందన
ఉరుకులు, పరుగులు తీస్తున్న అధికారులు
సాక్షి, వనపర్తి: ‘చిత్తు కాగితాల్లో బాల్యం’శీర్షికన ఈనెల 11వ తేదీన ‘సాక్షి’మెయిన్ ఎడిషన్‌లో ప్రచురించిన కథనానికి అదేరోజు స్పందించిన కలెక్టర్ ఎనిమిది మంది జిల్లాస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచే అధికారులు చెత్త కాగితాలు, వస్తువులు సేకరిస్తూ జీవనం గడుపుతున్న బాల బాలికలపై దృష్టి సారించారు. రెండురోజుల క్రితం పన్నెండేళ్ల గౌరి, పదమూడేళ్ల నారమ్మలను గుర్తించారు. వీరిని వీపనగండ్లలోని కస్తూర్బా పాఠశాలలో గౌరి (ఆరో తరగతి), నారమ్మ(ఏడో తరగతి)లను చేర్పించారు. గురువారం బండర్‌నగర్‌లోని బావిలోకి చెత్తకాగితాల కోసం దిగేందుకు ప్రయత్నిస్తున్న పదమూ డేళ్ల విములమ్మ, మరో యువతి లక్ష్మిని హెచ్‌ఎం కృష్ణయ్య, జీసీడీవో వసంత లక్ష్మి, సీఆర్‌పీ రాధ అడ్డగించారు.
వారిలో లక్ష్మికి 18 ఏళ్లు ఉండటంతో అధికా రులు ఇంటికి పంపించారు. విములమ్మను మరికుంటలోని కస్తూర్బా గాంధీ పా ఠశాలలో చేర్పించారు. కర్నూలు జిల్లా కోడు మూ రుకు చెందిన విములమ్మ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటంతో చిన్నాన్న గౌతమ్ వద్ద పెరుగుతోంది. ఆమెకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. పాఠశాలకు పంపించలేదు. గురువారం అధికారులు బాలికలను కేజీవీబీలో చేర్పించారనే విషయం తెలుసుకున్న విములమ్మ చిన్నాన్న అక్కడకు వచ్చి బాలికను ఇంటికి పంపించాలని అధికారులపై ఒత్తిడి చేసినా వారు ఒప్పుకోలేదు. విములమ్మ ఏడుస్తూ.. ‘ఇంటికి పోతే బాగా కొడతారు. ఇక్కడే ఉండి చదువుకుంటాను’అని చెప్పింది.