
జీతాలు పెంచితేనే నిజాయతీకి భరోసా
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలపై సీఎం కేసీఆర్ అభిప్రాయం
- 2 లక్షలు చేయాలని ప్రతిపాదన.. మంత్రులకు కూడా పెంచే యోచన
- మాజీలకు పెన్షన్ పెంపు.
సాక్షి, హైదరాబాద్: చట్టసభల సభ్యులకు వేతనాల పెంపు అనివార్యమని సీఎం చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. వారు నిజాయతీగా పనిచేయాలంటే సరిపోను వేతనాలు అందాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతి నిధులకు వేతనాల పెంపు ప్రతిపాదనపై సీఎం సోమవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సమీక్షిం చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు రూ. 95 వేల వరకు జీతభత్యాలు అందుతున్నాయని..పెరిగిన ఖర్చులకు ఇవే మాత్రం సరిపోవని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
ప్రజాప్రతినిధులు నిజాయతీగా పనిచేయాలని తాను కోరుకుంటున్నానని, అలాంటప్పుడు వారికి సరిపోయేంత జీతం కూడా ఇవ్వాలని సీఎం అన్నారు.ప్రస్తుతం తెలంగాణలో 120 ఎమ్మెల్యేలు, 40మంది ఎమ్మెల్సీలు ఉండగా... అందులో సీఎం, మంత్రులు, ఇతర కేబినెట్ హోదా కలిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 36 మంది వరకు ఉన్నారని చెప్పారు. మిగతా 124 మందికి నెలకు రూ. రెండు లక్షలు వేతనం చెల్లిస్తే.. ప్రతినెలా రూ. 2.5 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 30 కోట్లు, ఐదేళ్లకు రూ. 150 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం ఏటా రూ. 75 కోట్లు చెల్లిస్తున్నారని, పెంపుతో అదనంగా రూ. 75 కోట్ల వ్యయం అవుతుందని... ఐదేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఆమోదించే బడ్జెట్‌లో ఇది 0.14 శాతం మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. మంత్రులకు కూడా వేతనాలు రెట్టింపు చేసే అంశాన్ని పరిశీలించాలని... మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే పెన్షన్‌ను కూడా పెంచాలని సీఎం నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అలవెన్సులు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎస్‌ను ఆదేశించారు.