‘సుప్రీం’ ఆదేశించినా స్పందించలేదు: సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందిచకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు.
సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో ఈనెల 8లోపు చెప్పాలని సుప్రీంకోర్టు.. శాసనసభ స్పీకర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అరుుతే ప్రభుత్వం మాత్రం సుప్రీం ఆదేశాలపై ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదని చెప్పారు. రాజ్యాంగంపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో ఇది తెలియజేస్తోందని ఆరోపించారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.