కొత్త తరహా దందాకు తెరలేపిన ఇసుకాసురులు | Sand Dealers Are Finding New Ways For Illegal Sand Mining | Sakshi
Sakshi News home page

కొత్త తరహా దందాకు తెరలేపిన ఇసుకాసురులు

Published Thu, Oct 3 2019 8:02 AM | Last Updated on Thu, Oct 3 2019 8:02 AM

Sand Dealers Are Finding New Ways For Illegal Sand Mining - Sakshi

సాక్షి, మునుగోడు: ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. చట్టాలు, విధానాల్లోని లొసుగులను ఆసరగా చేసుకుని ఇసుక వ్యాపారులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ దందాను దర్జాగా సాగిస్తున్నారు. ఇటీవల మునుగోడు మండలంలో కొంపెల్లికి చెందిన ఓ వ్యాపారి, నారాయణపురం మండలానికి చెందిన మరో వ్యాపారి బినామీల పేరిట ఇసుకను బుకింగ్‌ చేసుకుని రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడడంతో దందా వెలుగులోకి వచ్చింది. 

సాండ్‌ టాక్స్‌ విధానంతో..
ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం సాండ్‌ టాక్స్‌ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయడంతో ఇసుకాసురుల ఆటలు సాగలేదు. ఈ విధానంలో ఇసుక అవసరమైన వ్యక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుని డబ్బులు చెల్లిస్తే.. ఇసుక రవాణాచేసే ట్రాక్టర్‌ నంబర్‌తో పాటు ఓటీపీ నంబర్‌ ఆ వ్యక్తి సెల్‌కు మేసేజ్‌ వస్తుంది. వచ్చిన ఇసుకని అన్‌లోడు చేయించుకున్న వ్యక్తి ఆ ఓటీపీ నంబర్‌ ట్రాక్టర్‌ యజమానికి ఇస్తే దానిని ఆయన ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే ట్రాక్టర్‌ రవాణా చార్జి ఆన్‌లైన్‌లో చెల్లిస్తారు.అయితే ఇలా జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తుండడంతో కొంత కా లంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది. 

బినామీ పేర్లతో..
సాధారణంగా ఇసుక అవసరమైన వారు మాత్ర మే సాండ్‌టాక్స్‌ పద్ధతిన ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని డబ్బులు చెల్లిస్తారు. కానీ మునుగోడు మం డలంలోని  వ్యాపారులు  ఇసుక అవసరం లేని వారి పేరు మీద ఆన్‌లైన్‌ బుక్‌ చేసి డబ్బులు చెల్లిస్తున్నారు. వచ్చిన ఇసుకను గ్రామ శివార్లలో ఎనిమిది ట్రాక్టర్ల  చొప్పున డంప్‌ చేసి రాత్రి వేళల్లో జేసీబీల సహాయంతో లారీల్లో లోడ్‌ చేసుకుని దర్జాగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీంతో ఉదయం సమయంలో అధికారికంగా అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లని అడ్డుకునే నాథుడే కరువయ్యాడు.

ఇసుక ధరకు రెక్కలు
ప్రస్తుతం వర్షాలు సంవృద్ధిగా కురిసి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక తోడే పరిస్థితి లేదు. ప్రధానంగా కాళేశ్వరంలో ఇసుక తోడేందుకు ఇబ్బం దిగా మారండంతో ఒక్కో లారీకి నెలలో ఒకటి రెండు ట్రిప్పులు మాత్రమే అవకాశం వస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఇసుక ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో టన్ను ఇసుక రూ. 1300కు విక్రయించగా ప్రస్తుతం రూ.1800ల నుంచి రూ.2500ల వరకు అమ్ముతున్నారు. 

ఒక్కో లారీ ఇసుకకు రూ. 30వేలకు పైనే ఆదాయం
హైదరబాద్‌కు కేవలం 70 కిలో మీటర్ల దూరంలో మునుగోడు, నారమణపురం మండలాల నుంచి ఇసుక రవాణాచేస్తే లారీ యజమానులకు రావాణా భారం తగ్గుతుంది. అయితే ఆ రవాణా ఖర్చుల కింద సాండ్‌ టాక్స్‌ ద్వారా తమ డంపింగ్‌ కేంద్రాల వద్ద ఇసుక పోస్తున్న ట్రాక్టర్‌ యజమానులకు ట్రిప్పుకు అదనంగా రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఒక లారీలో 32 టన్నులు ఇసుక లోడు చేసేందుకు 8 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుంది. అయితే ఆ ట్రాక్టర్‌కు రూ. సాండ్‌ టాక్స్‌ ఒక్కోక ట్రాక్టర్‌కు రూ. రూ.2,400లకు లభిస్తుండగా రూ. 19,200లకు లోడు అవుతుంది. అలా డంప్‌లో ఇసుక పొసిన ట్రాక్టర్స్‌కి వ్యాపారులు రూ. 1000 చెల్లించగా వారికి రూ. 2,7200 ఇసుక రావడంతో పాటు డీజిల్‌ ఖర్చు రూ.5వేలతో మొత్తం 32 టన్నుల ఇసుక హైదరబాద్‌కు తరిలిపొతోంది. ఆ ఇసుకని రూ.2వేల చొప్పున విక్రయించినా దాదాపు రూ. 64 వేలు రాగా అందులో ఖర్చులు పోను రూ.30వేలపైనే ఆదాయం వస్తోంది. మండలం లో 20 రోజులుగా రోజుకు 10 లారీల చొప్పున ఇసుకను హైదరాబాద్‌కు రవాణా చేస్తూ ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఇలా చేస్తేనే..
సాండ్‌ టాక్స్‌ విధానంలో కొన్ని నిబంధనలు పెడితేనే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా గతంలో ఇసుక అవసరం ఉన్న వ్యక్తి ఫోన్‌ నంబర్‌తో పాటు ఆధార్‌కార్డును కూడా అప్‌లోడ్‌ చేసిన తర్వాతే బుకింగ్‌ చేసుకునే వారు. కొంతకాలంగా ఆధార్‌ కార్డు లేకున్నా కేవలం ఫోన్‌ నంబర్‌ ఆధారంగా బుక్‌ చేసుకున్న వ్యక్తికి రోజుకు 5 ట్రాక్టర్ల చొప్పున ఇసుకను రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఇసుకాసురులకు వరంగా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న సాండ్‌ టాక్స్‌ విధానంలో ఇసుక అవసరం ఉన్న వ్యక్తి ఆధార్‌కార్డుతో పాటు సదరు వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడా లేదా అని సంబంధిత అధికారి ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్‌ చేసే విధంగా షరతు విధిస్తే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

ట్రాక్టర్‌ యజమానులను మచ్చిక చేసుకుని..
ప్రస్తుతం మండలంలోని కొరటికల్‌ గ్రామ వాగు నుంచి సాండ్‌టాక్స్‌ విధానంతో ఇసుక రవాణా జరుగుతోంది. అయితే ఆ వాగు నుంచి ఇసుక రవాణాచేసే ట్రాక్టర్‌ యజమానులను వ్యాపారులు మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. బినామీ పేర్లతో బుక్‌ చేసుకున్న వ్యాపారులు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్‌ యజమానులకు అదనంగా కొంత డబ్బు చెల్లించి మండలంలోని కొంపల్లి, చల్మెడ, వెల్మకన్నె, కల్వ కుంట్ల, గూడపూర్‌ గ్రామాల్లోని నిర్మానుష్య ప్రదేశాల్లో ఇసుకని డంప్‌ చేసి అక్రమ రవా ణాకు పాల్పడుతున్నారు.  ఇలా  20 రోజులుగా  ప్రతి రోజు దాదాపు 10 లారీల్లో ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  

కఠిన చర్యలు తీసుకుంటాం
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలుతీసుకుంటున్నాం. ఇటీవ దాడులు నిర్వహించగా మూడు ట్రాక్టర్లు ప ట్టుబడ్డాయి. వాటిపై వాల్టా కేసులు నమో దు చేశాం. అంతేకాకుండా అందుకు సహకరించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశాం.  ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి రోజు ట్రాక్టర్లను తనిఖీలు చేస్తాం.
– రజినీకర్, ఎస్‌ఐ, మునుగోడు

సాండ్‌ టాక్స్‌ని రద్దు చేయాలి
సాండ్‌ టాక్స్‌ ద్వారా మండలంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. సాండ్‌ టాక్స్‌ని రద్దు చేసి కేవలం స్థానిక అవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. లేదంటే ఇసుక వాగులు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. 
– చాపల శ్రీను, సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement