
బాబోయ్ ఏంటీ రేట్లు అనుకుంటున్నారా..? ఇదంతా మాఫియా మాయాజాలం. కృత్రిమ కొరత సృష్టించి, ఇసుకను గుప్పిటపట్టి వ్యాపారులు ఆడుతున్న నాటకం. సర్కారు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఈ నాటకంలో మాఫియాకు కోట్లు.. జనానికి పాట్లు!!
మహమ్మద్ ఫసియుద్దీన్: రాష్ట్రంలో ఇసుక బంగారమైంది. ధరలను మాఫియా శాసిస్తోంది. సామాన్యులతోపాటు బిల్డర్లకూ చుక్కలు చూపుతోంది. మేడారం జాతర నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహా పరిసర ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లలో ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు ప్రభుత్వం తవ్వకాలను నిలిపేయడంతో.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న మాఫియా కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలను పెంచేసింది.
హైదరాబాద్‌లో మూడ్రోజుల కింద రూ.1,150–1,200కు లభించిన టన్ను దొడ్డు రకం ఇసుక ఇప్పుడు అకస్మాత్తుగా రూ.1,500కు చేరింది. సన్న రకం ఇసుక రూ.1,250 నుంచి రూ.1,700కు పెరిగింది. లారీ ఇసుక (సగటున 30 టన్నులు) రూ.50 వేలకు పైనే పలుకుతోంది. ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం.. వ్యాపారులకు విక్రయించే ఇసుక ధరలను మాత్రమే నిర్ణయిస్తున్నారు. రిటైల్ ధరలను వ్యాపారుల అభీష్టానికే వదిలేయడంతో వారు చెప్పిందే రేటుగా సాగుతోంది.
తగ్గిన లభ్యత
కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు, ఉప నదులు, జలాశయాల్లో ఉన్న ఇసుక తవ్వకాల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కి బదలాయించింది. గతేడాది పాత 7 జిల్లాల పరిధిలో 56 చోట్ల ఇసుక తవ్వకాలకు టీఎస్‌ఎండీసీ ద్వారా అనుమతులిచ్చారు.
ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 18 రీచ్‌లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 రీచ్‌లు కలిపి 21 రీచ్‌లలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. మిడ్ మానేరుకు నీళ్లు వదలడంతో కరీంనగర్ జిల్లాలోని కాజీపేట్, కొత్తపల్లి రీచ్‌లు 8 నెలలుగా మూతబడ్డాయి. ఇసుక విక్రయానికి రాష్ట్రవ్యాప్తంగా 289 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయగా 50 పాయింట్లలోనే ఇసుక లభ్యత ఉంది. కృష్ణా నదిలో ఇసుక లభ్యత లేనందున తవ్వకాల్లేవు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.
వారికి పంట.. సామాన్యులకు తంటా
ప్రభుత్వం రీచ్‌ల వద్ద ఇసుకను క్యూబిక్ మీటర్‌కు రూ.550 (టన్నుకు రూ.357.5) చొప్పున విక్రయిస్తోంది. టీఎస్‌ఎండీసీ పేరిట మీ సేవా, ఆన్‌లైన్ కేంద్రాలకు డబ్బులు చెల్లించి రశీ దు పొందితే బుకింగ్ ఆర్డర్ మేరకు స్టాక్ పాయింట్ల వద్ద లారీల్లో ఇసుక నింపుతారు.
ఇసుక వ్యాపారులే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని హైదరాబాద్‌లో టన్నుకు రూ.1500– 1700లు, జిల్లాల్లో రూ.1200 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా విక్రయాలు జరుపు తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సామాన్యులకు ప్రయోజనం లేకుండా పోయింది. తాజా విధానంతో ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.500 కోట్ల ఆదాయం వస్తుండగా.. వ్యాపారులూ రూ.కోట్లల్లో సంపాదించుకుంటున్నారు.
జిల్లాల్లోనూ అంతే..
మానేరు ఇసుక క్వారీ నుంచి వరంగల్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరం ఉంది. జిల్లా కేంద్రానికి ఇసుక తీసుకొచ్చేందుకు లారీ రవాణాకయ్యే డీజిల్, డ్రైవర్, కూలీల ఖర్చులు కలిపి గరిష్టంగా రూ.1,800 మించదు. ఇలా 21 టన్నుల ఇసుక ధర (రూ.7,425) రవాణా ఖర్చులు కలిపి రూ.9,225 అవుతుంది.
ఈ లెక్కన వ్యాపారులకు టన్నుకు రూ.448 మాత్రమే లభిస్తుండగా, వినియోగదారులుకు మాత్రం రూ.1,000 నుంచి రూ.1200కు విక్రయిస్తున్నారు. దీంతో 21 టన్నుల ఇసుక లారీ వినియోగదారులకు చేరే సరికి రూ.25 వేలు అవుతోంది. వ్యాపారులకు రూ.15 వేల లాభం మిగులుతోంది.
ఇదీ అడ్డగోలు దోపిడీ
స్టాక్‌యార్డ్‌ల వద్ద టన్ను రూ.357.5 చొప్పున వ్యాపారులకు టీఎస్‌ఎండీసీ విక్రయిస్తోంది. లారీల్లో లోడింగ్ పరిమాణం ఆధారంగా క్వారీల్లో ధర 13.5 క్యూబిక్ మీటర్ల (21 టన్నులు)కు రూ.7,425.. 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నులు)కు రూ.5,775 గా ఉంది. ప్రభుత్వ ధరకు రవాణా ఖర్చులు కలిపి ఇసుకను విక్రయించాలి. ఇసుక లారీలు సగటున లీటరు డీజిల్‌కు 2–3 కి.మీ. ప్రయాణిస్తాయి. లీటర్ డీజిల్ ధర రూ.69 ఉండగా ఇసుకను హైదరాబాద్ తరలించేందుకు రాకపోకలు కలిపి గరిష్టంగా 600 కి.మీ.లు ప్రయాణించాలి.
ఈ లెక్కన సగటున రవాణా వ్యయం రూ.13,800 నుంచి రూ.20,700 అవుతుంది. 30 టన్నుల ఇసుకకు ప్రభుత్వ ధర రూ.10,725 కాగా.. హైదరాబాద్‌కు తరలించేందుకు రవాణా, ఇసుక వ్యయం కలిపి రూ.24 వేల నుంచి రూ.30 వేల వ్యయం అవుతుంది. వ్యాపారులు రూ.45 వేల నుంచి రూ.51 వేలకు విక్రయిస్తున్నారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రిటైల్ పాయింట్ ప్రారం భించి రూ.950 (క్యూబిక్ మీటర్‌కు రూ.1,425) చొప్పున టీఎస్‌ఎండీసీ విక్రయిస్తోంది. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఎస్‌ఎండీసీ ద్వారా విక్రయ కేంద్రా లు ఏర్పాటు చేస్తే ఇసుక ధరలు సామాన్యులకు కాస్త అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్ర ఇసుక అవసరాలు నెలకు - 4లక్షల క్యూబిక్ మీటర్లు
ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు - లక్ష క్యూబిక్ మీటర్లు
ప్రభుత్వ వార్షిక ఆదాయం - రూ.500 కోట్లు
రీచ్‌ల వద్ద క్యూబిక్ మీటర్ ఇసుక ధర - రూ.550
రీచ్‌ల వద్ద టన్ను ఇసుక ధర - రూ.357.5
హైదరాబాద్‌లో టన్నుఇసుక ధర - రూ. 1,5001,700
హైదరాబాద్‌లో లారీ ఇసుక ధర (30 టన్నులు) - రూ.50 వేలకు పైనే
జిల్లాల్లో టన్ను ఇసుక ధర - రూ. 1,000 - 1,200
జిల్లాల్లో 21 టన్నుల లారీ ఇసుక ధర - రూ.25 వేలు
Comments
Please login to add a commentAdd a comment