పెద్ద చెరువు ధ్వంసం | Sand Smuggling in Ravirala Pond Rangareddy | Sakshi
Sakshi News home page

పెద్ద చెరువు ధ్వంసం

Published Wed, Apr 17 2019 8:00 AM | Last Updated on Wed, Apr 17 2019 8:00 AM

Sand Smuggling in Ravirala Pond Rangareddy - Sakshi

మట్టి తవ్వకంతో చెరువు మధ్యలో ఏర్పడిన గోతులు

వేల ఎకరాలకు నీరందించే చెరువును అక్రమార్కులు చెర పట్టారు. హార్డ్‌వేర్‌ పార్క్, ఫ్యాబ్‌సిటీకి సమీపంలో విస్తరించిన ఈ చెరువును గుట్టుగా ధ్వంసంచేస్తున్నారు. ఆరు నెలల నుంచి విచ్చిలవిడిగా మట్టి తవ్వి ఫిల్టర్‌ ఇసుక తయారీ చేస్తున్నారు. అంతేకాకుండా మట్టిని వెంచర్లకు, ఇటుక బట్టీలకుతరలిస్తున్నా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. యథేచ్ఛగా వాల్టా చట్టాన్నితుంగలో తొక్కుతున్నా ప్రభుత్వ విభాగాల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇదే తరహా తవ్వకాలు ఇంకొన్నాళ్లు కొనసాగితే చెరువు నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది.  

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం మండలం రావిర్యాల రెవెన్యూ పరిధిలోని పెద్దచెరువు ఆ నియోజకవర్గంలోనే అతిపెద్ద నీటి వనరు. సుమారు 230 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెరువు నీటితో గతంలో రెండున్నర వేల ఎకరాల భూమి సాగయ్యేది. చుట్టుపక్కల గ్రామాలకు నీటి ఎద్దడి దరిచేరేది కాదు. ప్రస్తుతం ఈ చెరువు అస్తిత్వం కోల్పోతోంది. కొందరు అక్రమార్కులు  నామరూపాలు లేకుండా చేస్తున్నారు. పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఉదయమైతే అందరి కంట పడుతుందన్న ఉద్దేశంతో.. రాత్రి వేళలో ఫిల్టర్‌ ఇసుక తయారు చేస్తున్నారు. చెరువులో మట్టి తవ్వి శిఖం భూముల్లో డంప్‌ చేస్తున్నారు. సమీప రైతుల నుంచి నీటిని అద్దెకు తీసుకుని ఇక్కడ రాత్రివేళల్లో మట్టిని ఫిల్టర్‌ చేసి కృత్రిమ ఇసుకను జోరుగా తయారు చేస్తున్నారు. ఒక్కో లారీ ట్రిప్పు ఇసుకను బహిరంగ మార్కెట్‌లో రూ.20 వేల నుంచి రూ.23 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందాకు కర్త, కర్మ, క్రియ.. స్థానిక ప్రజాప్రతినిదే కావడం గమనార్హం. దాదాపు ఆరు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల కొన్ని రోజులపాటు నిలివేయగా.. తాజాగా మళ్లీ తయారు చేస్తున్నారు. ఒక్కో రాత్రి పదుల సంఖ్యలో ట్రిప్పుల ఇసుక తయారీ చేస్తూ చెరువును ధ్వంసం చేస్తున్నారు.  

కాసులు కురిపిస్తున్న మట్టి
మరికొందరు చెరువు మట్టితో వ్యాపారం చేస్తున్నారు. స్థానిక జేసీబీ, ట్రాక్టర్లు, ట్రిప్పర్ల యజమానులు అంతా రింగ్‌గా ఏర్పడ్డారు. 625 ఎకరాల్లో విస్తరించిన శిఖం భూముల్లో, చెరువులో మట్టి తవ్వి ఇటుక బట్టీలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల యజమానులకు విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ ఎర్రమట్టి  రూ.4,500 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే రావిర్యాల చుట్టూ సుమారు 30 వరకు ఇటుక బట్టీలు ఉంటాయి. చెరువులో లభిస్తున్న నల్ల మట్టిని ఈ బట్టీలకు యజమానులకు అమ్ముతున్నారు. ఈ చెరువు మట్టి మీద ఆధారపడే ఈ బట్టీలు కొనసాగుతున్నాయి. ఇందుకుకోసం నిత్యం 30 వరకు టిప్పర్లు, 20 వరకు ట్రాక్టర్లు, ఏడెనిమిది జేసీబీలు నడుస్తున్నాయి. వీటి సహాయంతో ప్రతిరోజు 300కుపైగా ట్రిప్పుల మట్టిని చెరువు నుంచి తరలిస్తుండటం గమనార్హం.  

అధికారులే అండగా..
చెరువులో విచ్చిలవిడిగా మట్టి తవ్వకాలకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు, పోలీసులు అండదండలు అందిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రతిఫలంగా వారికి భారీగానే ముడుపులు అందుతున్నట్లు సమాచారం. పోలీసులు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రిప్పు లెక్కన ఖాకీలకు మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. చెరువు దయనీయ స్థితిపై స్థానికులు కొందరు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా  చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తీవిస్తోంది. పైగా ఫిర్యాదుదారుల విషయంలో గోప్యత పాటించడం లేదు. సమాచారమిచ్చిన విషయంతో పాటు ఆ వ్యక్తి పేరును వెంటనే  మట్టి తవ్వకందారులకు చెప్పేస్తున్నారు. దీనిని బట్టి వారిద్దరి మధ్య ఉన్న పరస్పర సహకారం ఏపాటితో అర్థమవుతోంది.  

ముప్పు ముంగిట..
మహేశ్వరం మండలం ఇప్పటికే డేంజర్‌ జోన్‌లో ఉంది. ఇక్కడ తీవ్ర కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఈ ప్రాంతంలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. మరోపక్క చెరువుల్లో మట్టి తవ్వకాలతో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. ఈ మండలంలో ప్రస్తుతం 22.76 మీటర్ల లోతుకు భూగర్భ నీటి మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు చెరువు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ బోరు తవ్వించినా పుష్కలంగా నీరు వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న బోర్లలో నీరు కూడా నానాటికీ పాతాళానికి చేరుతోంది. ఇటువంటి సమయంలో చెరువుల్లో తవ్వకాలకు చెక్‌ పెట్టాల్సిన అధికారులు చేతులెత్తారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఈ స్థాయిలో ప్రమాదకర ఘంటికలు మోగేవి కావన్న అభిప్రాయం  వ్యక్తమవుతోంది. చెరువులో మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ హరీష్‌ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ‘చెరువులో తవ్వకాలు వాల్టా చట్టానికి విరుద్ధం. దీనిపై విచారణ చేస్తాం’ అని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement