కొడుకు మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి
బొంరాస్‌పేట : ‘మీ నాన్న సచ్చినప్పుడు మూడేండ్లోడవుంటివి కొడుకా.. ఉడుకు నీళ్లంటేనే నీకు భయం.. చేతులార పెంచి పెద్ద చేస్తే ఇట్లా చెరువులో పడి శవమయ్యావా బిడ్డా’.. అంటూ ఓ తల్లి కొడుకు శవం వద్ద రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లి గళ్లంతైన యువకుడి శవం శనివారం మధ్యాహ్నం లభ్యమైంది. బొంరాస్‌పేట మండల పరిధిలోని తుంకిమెట్లకు చెందిన లావ నర్సింలు, జయమ్మ దంపతుల కుమారుడు రాజు(20). మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో ఐటీఐ చదువుతున్నాడు.
స్నేహితులతో విందుకని ఏర్పుమళ్లకు వెళ్లాడు. శుక్రవారం నలుగురు స్నేహితులతో కలిసి ఏర్పుమళ్ల కాకర్‌వాణీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం విధితమే. కాగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకొని శనివారం మధ్యాహ్నం గల్లంతైన యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. చేతికొందొచ్చిన కొడుకు శవమై కనిపించడంతో ఆ తల్లి రోదన అంతాఇంతా కాదు.. తండ్రి చనిపోయినా.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని జయమ్మ ఏడ్చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
స్నేహితులపై అనుమానం ఉంది..
శుక్రవారం రాత్రి తన కొడుకు లావ రాజును ఇంట్లో నుంచి పిలుచుకొని వెళ్లి ఇలా శవమై చేతికిచ్చారని మృతుడి తల్లి జయమ్మ గుండెలు బాదుకుంటూ విలపించింది. ఏర్పుమళ్లకు చెందిన స్నేహితులు విందుకు తీసుకువెళ్లి చెరువులో గల్లంతయ్యాడని చెప్పి శవంగా మార్చారని ఆరోపించింది. తన కొడుకు నీటిలో శవంగా కనిపించడంలో అనుమానం ఉందని, స్నేహితులే బాధ్యులని ఫిర్యాదు చేసింది. తన కొడుకు రాజు స్నేహితులు ఏర్పుమళ్లకు చెందిన సందారం ప్రవీణ్‌కుమార్, ఈడ్గి శ్రీకాంత్, బాబర్‌లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
గజ ఈతగాళ్లతో గాలింపు
ప్రాజెక్టు నీటిలో గల్లంతైన లావరాజు కోసం శనివారం మధ్యాహ్నం వరకు ముమ్మరంగా గాలింపు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. శనివారం కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి నలుగురు గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చేయగా మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి కొడంగల్ సీఐ శంకర్ ఆరా తీశారు. మృతుడి తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment