
'నిబంధనలకు పాతర వేసే విధంగా ప్రభుత్వం తీరు'
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నిబంధనలకు పాతర వేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. సభా వ్యవహారాల మండలి(బీఏసీ)లో ఏ పార్టీలో ఎవరుండాలనేది ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాసనసభ తీరు నిబంధనలకు పాతర వేసే విధంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మాట్లాడనీయకుండా చేసి.. ఆ ఆరోపణలు మార్చి చివరకు దళితుడ్ని అవమానించారంటున్నారని ఆయన అన్నారు. అఖిలపక్షంలో వీటిపై చర్చించి తమ సభ్యుడు నడుచుకుంటాడని.. రేవంత్ అసభ్యంగా మాట్లాడితే రికార్డ్ నుంచి తొలగించాలని లేది స్పీకర్ కు రూలింగ్ ఇవ్వాలన్నారు. ఒక సభ్యుడ్ని మాట్లాడనివ్వకుండా టీడీపీని గొంతునొక్కడమేనని సండ్ర తెలిపారు.
అసలు చాలా అంశాలపై స్పష్టత లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని తమ సభ్యులకు విప్ జారీ చేశామన్నారు. చివరకు తమ సభ్యులను మాట్లాడనివ్వకపోవడంతో తాము బయటకు వచ్చామన్నారు.అందుకు స్పీకరే సాక్ష్యమన్నారు. తమతో బయటకు రాకుండా సభలో ఉన్న ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు.