12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. టీఆర్‌ఎస్‌లో విలీనం | 12 tdp mlas merged in trs | Sakshi
Sakshi News home page

12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. టీఆర్‌ఎస్‌లో విలీనం

Published Fri, Mar 11 2016 1:48 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. టీఆర్‌ఎస్‌లో విలీనం - Sakshi

12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. టీఆర్‌ఎస్‌లో విలీనం

ఎమ్మెల్యేల లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకున్న స్పీకర్
టీఆర్‌ఎస్ సభ్యులతో పాటు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు
టీఆర్‌ఎస్‌ఎల్పీ సభ్యులుగానే గుర్తింపు
గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యాలయం.. శాసనసభలో 85కు చేరిన టీఆర్‌ఎస్ బలం
రాష్ట్రంలో ఇప్పటికే ఉనికి కోల్పోయిన టీడీపీ
  తాజా ‘విలీనం’తో ఆ పార్టీ కథ ముగిసిపోయినట్లే!
  ఇక వారికి మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలే


 సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసిపోయింది.. ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంతగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా... తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారు. మూడింట రెండొంతులకు పైగా ‘చీలిపోయామని’, తమను టీఆర్‌ఎస్‌లో కలిపేయాలన్న ఆ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పరిగణనలోకి తీసుకున్నారు. వారిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం రాత్రి తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జి.సాయన్న, టి.ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కె.పి.వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలను ఇక నుంచి టీఆర్‌ఎస్‌ఎల్పీ సభ్యులుగా పరిగణిస్తారు. శుక్రవారం నుంచి అసెంబ్లీలో టీఆర్‌ఎస్ సభ్యులు కూర్చున్న చోట వీరికి సీట్లు కేటాయించాలని స్పీకర్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో 15 మంది సభ్యులతో మొదలైన టీడీపీ ప్రస్థానం.. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలకే పరిమితమైనట్లయింది.

తలసానితో మొదలైన ముసలం
 టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే టీడీపీకి వలసల ముసలం మొదలైంది. హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డిలు పార్టీ మారడంతో మొదలైన కలకలం... చివరకు ఆ పార్టీ ఉనికికి ఎసరు తెచ్చింది. గత ఏడాది జనవరికి ముందే తలసాని, తీగల గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అదే వరుసలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. తలసానికి ఏకంగా మంత్రి పదవి ఇవ్వడం టీడీపీని షాక్‌కు గురి చేసింది. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనూహ్య ఫలితాలను సాధించి గ్రేటర్ హైదరాబాద్‌లో పాగా వేయగా.. టీడీపీ ఏకంగా ఉనికిని కోల్పోయింది.

ఎర్రబెల్లితో కథ క్లైమాక్స్
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 11న టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వివేకానంద, రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో కథ క్లైమాక్స్‌కు చేరింది. ఈ నలుగురితో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. అదే రోజున తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ ఎర్రబెల్లి సారథ్యంలో పది మంది ఎమ్మెల్యేలు శాసనసభాపతికి లేఖ ఇచ్చారు. రాజ్యాంగం పదో షెడ్యూల్‌లోని నాలుగో పేరా ప్రకారం సరిపడే సభ్యుల సంఖ్యా బలం ఉన్నందున తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు రోజే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఎర్రబెల్లిని టీడీపీ అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. టీడీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని గుర్తించాలని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. ఇక టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ రేవంత్‌రెడ్డి స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖల వ్యవహారం తేలకముందే... బుధవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తమను కూడా టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ మధుసూదనచారికి లేఖ ఇచ్చారు.

 న్యాయపోరాటం చేస్తాం: రేవంత్
 పన్నెండు మంది టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయాన్ని టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
 
 ఇవీ తాజాగా పార్టీల బలాబలాలు
 టీఆర్‌ఎస్        85 (నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి)
 కాంగ్రెస్        15
 ఎంఐఎం        7
 బీజేపీ        5
 టీడీపీ        3
 వైఎస్సార్‌సీపీ    1
 సీపీఎం        1
 సీపీఐ        1
 స్వతంత్రులు    1
 (ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణంతో పాలేరు స్థానం ఖాళీగా ఉంది)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement