చీపుర్లకూ దిక్కులేదు | Sanitation in some ways .. | Sakshi
Sakshi News home page

చీపుర్లకూ దిక్కులేదు

Published Fri, Jun 20 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

చీపుర్లకూ దిక్కులేదు

చీపుర్లకూ దిక్కులేదు

  • కొన్ని మార్గాల్లోనే పారిశుద్ధ్యం..
  •  మిగతా అంతా అధ్వానం
  •  ఇదీ జీహెచ్‌ఎంసీ వ్యవహారం
  •  అరిగిపోయిన చీపుర్లు.. చాలీ చాలని పరికరాలు.. వీటితోనే పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. లేకపోతే చర్యలు. దీంతో కార్మికులు నడుములు విరిగిపోతున్నా అరిగిపోయిన చీపుర్లనే ఉపయోగిస్తున్నారు. వారెంత మొత్తుకున్నా నెలల తరబడి చీపుర్లు మాత్రం ఇవ్వరు. అయితే వీఐపీలున్న ప్రాంతాలను మాత్రం ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టుకు ఇచ్చేసి వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాధారణంగానే అవి పరిశుభ్రంగా ఉంటాయి. వాటిలో పెద్దగా కష్టపడాల్సిన అవసరంకూడా ఉండదు. ఇదీ గ్రేటర్‌పై జీహెచ్‌ఎంసీకి ఉన్న శ్రద్ధ.
     
    సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ నగరంలో పలు రహదారులు పరమ అధ్వానంగా, చెత్తా చెదారాలతో కంపు కొడుతున్నా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ వీఐపీల మార్గాల్లో మాత్రం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. వీఐపీల మార్గాల్లో ఈ పనులు చేసే కాంట్రాక్టు సంస్థకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్న జీహెచ్‌ఎంసీ మిగతా అన్ని మార్గాల్లో వీధులను శుభ్రపరుస్తున్న కార్మికులకు నాలుగైదు నెలలుగా కనీసం చీపుర్లు కూడా ఇవ్వడం లేదు.

    చీపుర్ల నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్య నిర్వహణలో వినియోగించే ఇతరత్రా పరికరాలు సైతం సరఫరా చేయడం లేదు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు చెత్తమయంగా మారాయి.  జీహెచ్‌ఎంసీ మొత్తానికి వీటిని సరఫరా చేస్తున్నది ఒకే ఒక కాంట్రాక్టరు కావడంతో అవసరమైనన్ని చీపుర్లు సకాలంలో అందడం లేదు.పేరుకు మాత్రం కేంద్రీయ భండార్‌వంటి సంస్థలు సరఫరా చేస్తున్నా ఒకే వ్యక్తి  వాటిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

    పండుగల వంటి  అత్యవసర సమయాల్లో ఆదరాబాదరాగా కొంత సామగ్రి సరఫరా చేయడం మినహా మిగతా సమయంలో చీపుర్లతో సహాఎలాంటి ఉపకరణాలు  అందించడం లేరు. దాంతో అరిగిపోయిన చీపుర్లతోనే కార్మికులు తమ నడుములు విరిగేలా పనిచేయాల్సి వస్తోంది. కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రెండేసి  చీపుర్లు అవసరం కాగా నాలుగైదు నెలలుగా వాటి సరఫరా లేదు. వీటి పేరిట బిల్లులు మాత్రం జారీ అవుతున్నాయనే ఆరోపణలున్నాయి.

    కొన్ని మార్గాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం లక్షలాది రూపాయలు  వెచ్చిస్తున్న జీహెచ్‌ఎంసీ మిగతా నగరాన్ని గాలి కొదిలేసింది. కాంట్రాక్టుకిచ్చిన మార్గాలు మిగతా వాటితో పోలిస్తే ఎంతో మెరుగైన రహదారులు. ఆ రహదారుల వెంబడి ఉన్న  ఫుట్‌ఫాత్‌లపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతరత్రా ఆటంకాలు  లేకుండా జీహెచ్‌ఎంసీనే శ్రద్ధ తీసుకుంటోంది. అదే శ్రద్ధను అన్ని మార్గాల్లో చూపితే పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో శ్రమ తగ్గుతుంది. అధ్వానపు రహదారులు మాత్రం జీహెచ్‌ఎంసీ కార్మికులకప్పగించి అందమైన రోడ్ల మార్గాలను కాంట్రాక్టుకివ్వడం విమర్శలకు తావిస్తోంది.
     
    ప్రైవేటు కిచ్చిన మార్గాలివే..
     
    మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్, బేగంపేట, మాదాపూర్ ప్రాంతాల్లో 24  కిలోమీటర్ల మేర రహదారుల పారిశుధ్య కార్యక్రమాలను  ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ కప్పగించారు.  ఈ కాంట్రాక్టును పొందిన  మాక్లియన్ కంపెనీకి తాజ్ గ్రూప్, పార్క్‌హయత్ వంటి స్టార్‌హోటళ్లు, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో తప్ప ఇతర చోట్ల పనులు చేసిన అనుభవం లేదు. కాంట్రాక్టు సంస్థకు సదుపాయంగా ఉండేందుకే ఆ మార్గాల్లో ఫుట్‌పాత్‌ల మర్మతులు, రోడ్ల ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టారనే ఆరోపణలున్నాయి.  

    ఆ మార్గాల్లో  పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న  కాంట్రాక్టు ఏజెన్సీకి రెండు ట్రాలీలు తప్ప తగిన సాల్వెంట్(పారిశుధ్య) ఉపకరణాలు  కూడా లేవు. సదరు సంస్థ పనులు చేస్తున్న మార్గాల్లో జీహెచ్‌ఎంసీ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. సదరు సంస్థ ఉదయం 7.30 నుంచి రాత్రి 7  గంటల వరకు మాత్రమే పని చేస్తోంది.  మిగతా సమయమంతా జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బందే  పనులు చేస్తున్నారు.

    కాంట్రాక్టు సంస్థ సేకరించిన చెత్తను కూడా తిరిగి జీహెచ్‌ఎంసీ  ట్రాన్స్‌ఫర్ స్టేషన్స్‌కే  పంపుతున్నారు. అక్కడినుంచి డంపింగ్‌యార్డుకు తరలించే పనులు జీహెచ్‌ఎంసీ చేస్తోంది. కాంట్రాక్టు సంస్థకు  ఇన్న సదుపాయాలు కల్పిస్తుండగా, జీహెచ్‌ఎంసీ కార్మికుల అవస్థలు మాత్రం పట్టించుకోవడం లేరు.  రెండున్నరేళ్లుగా తగినన్ని పారిశుధ్య ఉపకరణాల్లేవు.  నాలుగైదు నెలలుగా కనీసం చీపుర్లు కూడా లేక పారిశుధ్య కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారు.

    చీపుర్లు, పొడవాటి కర్రలు, సున్నం, బ్లీచింగ్, తోపుడు బంండ్లు, రిక్షాలు, గడ్డపారలు, గంప, ఇనుపగంప,యాక్సర్‌బ్లేడ్లు,  సల్కెపార తదితరమైనవి  వారికి అవసరం.అయితే అవేవీ అందుబాటుల లేవు.  అరిగిపోయిన చీపుర్లతోనే నెలల తరబడి నెట్టుకొస్తున్నారు.  అరిగిన చీపుర్లతో  వంగి ఊడ్చాల్సి ఉండటంతో వారి నడుములు దెబ్బతింటున్నాయి.
     
    సెంట్రల్ స్టోర్ ఉంటే మేలు..
     
    గతంలో ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు పారిశుద్ధ్యానికి అవసరమైన సామగ్రి  సెంట్రల్‌స్టోర్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండేది. దాంతో అవసరం మేరకు  ఎప్పటికప్పుడు కార్మికులు వాటిని పొందేవారు. వికేంద్రీకరణ పేరిట ఆ విధానాన్ని మర్చారు. పేరుకు వికేంద్రీకరణ జరిగినప్పటికీ, జీహెచ్‌ఎంసీలోని 18 సర్కిళ్లలో ఎక్కడా కూడా  ఉపకరణాలుంచేందుకు తగిన స్థలం లేదు. దాని వల్ల కూడా వస్తువులు స్టాకు ఉండటం లేదు. దీంతో  కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్లీచింగ్, సున్నం, చీపుర్లు తప్ప ఇతరత్రా  ఉపకరణాలు  లేవు. సంవత్సరానికి దాదాపు రూ. 3 కోట్లు వెచ్చిస్తే  పారిశుద్ధ్యానికి అవసరమైన ఉపకరణాలన్నీ అందుబాటులో ఉంటాయి.  ఏటా ప్రైవేటుకు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంది.
     
    కాంట్రాక్టు పొందిన సంస్థ
    ఈ  నిబంధనలు అమలు చేయాలి
    రహదారుల వెంబడి ఉన్న సంస్థలు, దుకాణాలు, ఇళ్ల  నుంచి చెత్తను సేకరించాలి.

    ఫుట్‌పాత్‌లపై చెత్త లేకుండా చూడాలి. ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ఫుట్‌పాత్‌లపై కాగితాలు, వ్యర్థాలు వేయకుండా నిఘా వహించాలి.

    రోడ్ల మార్గాల్లో పోస్టర్లు, బ్యానర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏర్పాటు చేసినా వెంటనే తొలగించాలి.

    రహదారిని ఎల్లవేళలా చెత్తాచెదారం ఏవీ లేకుండా అందంగా, పరిశుభ్రంగా ఉంచాలి.

    ఈ కార్యక్రమాన్ని  ‘కాంప్రహెన్సివ్ ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్’ (ప్రధాన రహదారుల సమగ్ర నిర్వహణ)గా వ్యవహరిస్తారు.

    ఆయా సంస్థలు తడి, పొడి చెత్తకు వేర్వేరు డబ్బాలు వినియోగించేలా చూసే బాధ్యత కాంట్రాక్టరుదే.

    పనితీరుపై ఓఎస్సార్టీ ద్వారా రోజుకు నాలుగుసార్లు ఫొటోలు తీయాలి.

    ప్రది వంద మీటర్ల దూరానికీ ఈ ఫొటోలు తీయాలి.

    అవసరమైన స్వీపింగ్ యంత్రాలను జీహెచ్‌ఎంసీ సమకూరుస్తుంది.
     
     ఇవి చేయకుంటే ఒప్పందం ఉల్లంఘించినట్లే..
    ఏరోజైనా ఓఎస్సార్టీ ద్వారా ఫొటోలు అప్‌లోడ్ చేయకుంటే..
    తనిఖీల్లో రోడ్డు శుభ్రంగా లేకున్నా.. ఫొటోల్లో శుభ్రంగా లేకున్నా..
    అరవై నిమిషాల్లోగా చెత్త, వ్యర్థాలు, డెబ్రిస్ తొలగించనట్లయితే..
    గంటలోగా పోస్టర్లు, బ్యానర్లు తొలగించకుంటే
    వీటిల్లో ఒక్క అంశం(పాయింట్)లో విఫలమైనా నెలవారీ చెల్లింపులో 3 శాతం తగ్గిస్తారు. ఒకే నెలలో 30 పాయింట్లలో ఉల్లంఘనలు జరిగితే చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తారు.
     
    నగరమంతా మెరుగుపరుస్తాం : కమిషనర్ సోమేష్ కుమార్
    నగరమంతా పరిశుభ్రంగా ఉండాలనేదే లక్ష్యమని. తొలిదశలో భాగంగా  సంస్థ పనితీరు అంచనా వేసేందుకు కొన్ని మార్గాలు ప్రైవేటుకిచ్చామని కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు.  పనితీరు బాగుంటే మిగతా  ప్రాంతంలో అమలు  చేసేందుకు ప్రయత్నిస్తామని,  లేకుంటే నిబంధనల మేరకు సొమ్ము చెల్లించబోమన్నారు.  పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడానికి చీపుర్లు, ఇతర వస్తువులు అందుబాటులోనే ఉన్నాయని అడిషనల్ కమిషనర్(ఆరోగ్యం,పారిశుద్ధ్యం)రవికిరణ్ తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement