సాక్షి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం కల్పిస్తూ ప్రభుత్వం వారి వేతనాలను పెంచింది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వేతనాలు వచ్చేనెల నుంచి అమలుకానున్నాయి. గౌరవ వేతనం పెంపు నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు రూ.10 కోట్ల అదనపు భారం పడనుంది.
సంబరాలు..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మొదలు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌ల గౌరవ వేతనాలను భారీగా పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటన వెలువడిన వెంటనే జిల్లాలో టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకొన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ క్షీరాభిషేకం చేశారు. జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు మనోహర్‌గౌడ్, ఇతర నాయకులు జెడ్పీ ఆవరణలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.
జిల్లా తరఫున అదనపు భారం రూ.10 కోట్లు..
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా కాలంగా తమ గౌరవ వేతనం పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా పెంచింది. పెరిగిన గౌరవ వేతనాల ప్రకారం... జెడ్పీ చైర్‌పర్సన్‌కు నెలకు రూ. లక్ష, జెడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.10 వేల చొప్పున, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ వైస్ చైర్మన్‌లకు రూ.5 వేల చొప్పున, మున్సిపల్ చైర్మన్‌కు రూ.12 వేలు, కౌన్సిలర్లకు రూ.2,500 చొప్పున అందనున్నాయి. తాజాగా పెంచిన వేతనాలతో జిల్లాకు సంబంధించి రూ.10 కోట్ల అదనం భారం పడనుంది.
జెడ్పీ చైర్‌పర్సన్‌కు పెరిగిన వేతనం కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.11.10 లక్షల అదనపు భారం పడనుంది. అలాగే జెడ్పీటీసీలకు సంబంధించి రూ.42.78 లక్షలు, ఎంపీపీలు రూ.46.92 లక్షలు, ఎంపీటీసీలు రూ.3.49 కోట్లు, సర్పంచ్‌లకు సంబంధించి రూ.4.47 కోట్ల అదనం భారం పడనుంది. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు సంబంధించి సుమారు మరో రూ.3 కోట్ల అదనం భారం ప్రభుత్వంపై పడనుంది.
సర్పంచ్‌ల అసంతృప్తి..
తాజాగా పెరిగిన గౌరవ వేతనాలపై సర్పంచ్ లు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. తమ గౌరవ వేతనం రూ.20 వేలకు పెంచాలని వారు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు సైతం గౌరవేతనం మరింత పెంచాలని కోరుతున్నారు.
పెరిగిన ‘గౌరవం’
Published Sat, Mar 14 2015 12:25 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement