స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి | Satyavathi Rathod Takes Oath As Cabinet Minister | Sakshi
Sakshi News home page

సత్యవతి రాథోడ్‌ అను నేను..

Published Mon, Sep 9 2019 11:43 AM | Last Updated on Sun, Sep 22 2019 1:51 PM

Satyavathi Rathod Takes Oath As Cabinet Minister - Sakshi

సత్యవతి రాథోడ్‌ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన.. లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఏ వ్యక్తికి లేదా సంస్థలకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి గిరిజన మహిళా మంత్రిగా కేసీఆర్‌ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్‌ చోటు దక్కించుకున్నారు. అనుభవం, పనితీరు కారణంగా ఆమెకు మంత్రి వర్గంలో గిరిజన కోటాలో స్థానం లభించిందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సత్యవతిరాథోడ్‌ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆమెకు సీఎం కేసీఆర్‌ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖను కేటాయిం చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గిరిజన మహిళగా ప్రమాణ స్వీకారం చేయటంతో గిరిజన జిల్లా అయిన మానుకోటలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు.. 
మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్ద తండాలో 1969లో జన్మించిన సత్యవతి రాథోడ్‌ 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలుత మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా పోటీ చేసి ఓడిన ఆమె ఆపై గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా విజయం సాధించారు. 1989లో డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి రెడ్యా చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. 1995లో సర్పంచ్‌గా, 2005లో నర్సింహులపేట జెడ్పీటీసీగా గెలు పొందారు. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సత్యవతి తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2013లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పదవిని అలకంరించారు.

విధేయతకు గుర్తింపు
సత్యవతిరాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి జయాపజాయలకు కుంగిపోకుండా వినయ విధేయలతో పార్టీలో అంకితభావంతో కొనసాగారు. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రిగా పట్టం కట్టారు. 2014లో డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించినప్పటికీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటంతో పార్టీ మారకుండా రెడ్యానాయక్‌ గెలుపుకోసం పనిచేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నల్గొండ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తూనే అధిష్టానం వద్ద తన పట్టును మరింత పెంచుకున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. పార్టీకోసం సత్యవతి రాథోడ్‌ చేసిన సేవలను గుర్తించిన ఆధిష్టానం మంత్రిపదవితో సత్కరించిందని ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక సత్యవతి రాథోడ్‌ను మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, మానుకోట జిల్లా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షాలు తెలియజేశారు.

నాడు రెడ్యాకు.. నేడు సత్యవతికి
డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందిన రెడ్యానాయక్‌ నాడు వైఎస్సార్‌ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. కాగా 11 సంవత్సరాల తరువాత తిరిగి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి సత్యవతి రాథోడ్‌ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవిని చేపట్టారు.

బయోడేటా..


పేరు : భూక్య సత్యవతిరాథోడ్‌
తల్లిదండ్రులు : లింగ్యానాయక్, దస్మి
స్వస్థలం : కురవి మండలం పెద్దతండా జీపీ
భర్త : భూక్య గోవింద్‌రాథోడ్‌(లేట్‌)
కుమారులు, కోడల్లు : భూక్య సునీల్‌కుమార్‌రాథోడ్‌–సోనమ్‌, డాక్టర్‌ సతీష్‌రాథోడ్‌–బిందు
విద్యార్హత : బీఏ(అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ)
స్ఫూర్తినిచ్చిన నేత : సీఎం కేసీఆర్‌
అభిమానించే వ్యక్తి : దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌
నచ్చిన ప్రదేశం : డోర్నకల్‌ నియోజకవర్గం
మరచిపోలేని రోజు: 2009లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గోవింద్‌రాథోడ్‌ మృత్యువాతకు గురికావడం.
రాజకీయచరిత్ర : 1984లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో తెలుగు మహిళా జిల్లా కన్వీనర్‌గా, 1985లో టీడీపీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, అదే సంవత్సరం రాష్ట్ర ఎస్టీసెల్‌ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 1987లో మేన మామ బానోత్‌ సక్రాంనాయక్‌పై కురవి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1987లో భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయ ట్రస్టు బోర్టు సభ్యురాలిగా నియమితులయ్యారు. 1989లో టీడీపీ తరఫున డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1995లో గుండ్రాతిమడుగు(విలేజి) సర్పంచ్‌గా జనరల్‌ స్థానం నుంచి గెలుపొం దారు. 2001లో కురవి మండలం చింతపల్లి ఎంపీటీసీ స్థానానికి పోటీచేసి ఓడిపాయారు. 2006లో నర్సింహుంలపేట జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో డోర్నకల్‌ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా రెడ్యానాయక్‌పై విజయం సాధించారు. 2014 మార్చి 3న టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రెడ్యానాయక్‌పై పోటీ చేశారు. 2019 మార్చి 12న ఎమ్మెల్యే కోటా కింద టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్‌ 8న తొలి గిరిజన మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎప్పుడు ప్రజలతోనే మమేకం
చిన్పప్పటి నుంచి ప్రజలతోనే తిరుగుతుండేది. చిన్పప్పుడే సర్పంచ్‌గా గెలిచింది. చెల్లే నేను మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఎమ్మెల్యేగా గెలిచి పేదల కోసమే పనిచేసేది. తెలంగాణ కోసం అందరం కష్టపడ్డాం. చెల్లె కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని అందులోకి వెళ్లి బంగారు తెలంగాణ కోసం పనిచేసింది. కష్టపడ్డదానికి ఫలితం దక్కింది. సీఎం కేసీఆర్‌ చెల్లెకు మంత్రి పదవి ఇచ్చి గౌరవాన్ని పెంచాడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గుగులోత్‌ కిషన్‌నాయక్, కనకమ్మ(సత్యవతి రాథోడ్‌ అన్న, వదిన)

నా బిడ్డ గొప్పదైంది.. 
నాబిడ్డ గొప్పదైంది. చిన్నప్పటి నుంచి పార్టీల్లోనే తిరిగేది. చిన్నతనంలో పెళ్లి చేశాము. అయినా రాజకీయాల్లోనే తిరిగేది. సర్పంచ్‌గా గెలిచింది. ఇప్పుడు మంత్రి అయిందని తెలిసింది. సంతోషంగా ఉంది. ఎప్పుడూ ప్రజలతోనే మాట్లాడుతుంది. వారితోనే ఎక్కువగా ఉంటుంది. మాకు సంతోషమే. నాబిడ్డ గొప్ప పదవిలో ఉంది. ఆమెను చూసేందుకు హైదరాబాద్‌ వెళ్తున్నాం.
– గుగులోత్‌ దస్మి, లింగ్యానాయక్‌(సత్యవతిరాథోడ్‌ తల్లిదండ్రులు)

బాధ్యత పెరిగింది
సీఎం కేసీఆర్‌ అప్పగించిన మంత్రిపదవితో నాపై బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర ప్రజల అవసరాలు.. వారి ఆకాంక్షలకు తగినట్టుగా పనిచేస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో మందుంటా. నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. నావెంట పయనించిన అనుచరులు, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం అహర్నిశలు పనిచేస్తా.
– సత్యవతి రాథోడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement