సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం కల్పించారు. సోమవారం నుంచి అసెంబ్లీ శాసనసభ బడ్జెట్– 2019–20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మలి విడత మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సామాజిక కోణాలు, సమీకరణల దృష్ట్యా మలి విడతలో రెండో మంత్రిగా ఉమ్మడి జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఉండకపోవచ్చని అందరూ భావించారు.
అయితే అనూహ్యంగా ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పించారు. ఆమెకు కీలకమైన గిరిజన, స్రీ, శిశుసంక్షేమ శాఖలు కూడా కేటాయించారు. మరోవైపు ఇటు శాసనసభ.. అటు శాసనమండలిలో కీలక పోస్టుల్లో దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లులను ప్రభుత్వ చీఫ్ విప్‌లుగా శనివారం నియమించారు. 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా తాడికొండ రాజయ్య(తర్వాత కడియం శ్రీహరి), మంత్రిగా అజ్మీరా చందూలాల్, శాసనసభ స్పీకర్‌గా మధుసూదనాచారిలకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీలు పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లులను శాసనమండలిలో విప్‌లుగా నియమించారు. అయితే ఈసారి బి.వెంకటేశ్వర్లుకు చీఫ్ విప్‌గా పదోన్నతి లభించగా.. పళ్లా రాజేశ్వర్‌రెడ్డికి ‘విప్’ పదవి కూడా చేజారింది.
ప్రకటించే కమిటీలపై ఆశలు
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన సత్యవతిరాథోడ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే మంత్రివర్గ విస్తరణ అంశం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ‘విప్’కు దూరమైన ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, మాజీ మంత్రి రెడ్యానాయక్ తదితరుల పేర్లు సైతం ఆశావహుల జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మంత్రి వర్గంలో ఇదివరకే ముఖ్యమంత్రిని కలుపుకుని 12 మంది మంత్రులున్నారు. 18 మంది మంత్రులు తప్పనిసరి కావడంతో మరో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి గతంలో స్పీకర్, ఇద్దరు మంత్రులు ఉండగా.. ఈ సారి కూడా రెండో మంత్రి స్థానంలో పలువురి పేర్లు ప్రచారంలోకి రావడానికి కారణమైంది.
పలువురు ప్రయత్నం చేసినా.. షెడ్యూల్డ్ తెగకు చెందిన ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో ఆశావహ సీనియర్ నేతల ఆశలు అడియాసలయ్యాయి. అయితే సీనియర్ నేతలు, మాజీ మంత్రులను సైతం సభాకమిటీలు, కార్పొరేషన్ చైర్మన్ తదితర కీలక పదవుల్లోకి తీసుకునే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు శనివారం నుంచి ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి ఈ అవకాశం కల్పించనుండగా.. ఉమ్మడి వరంగల్ నుంచి కడియం శ్రీహరి, పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, అరూరి రమేష్, రెడ్యానాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటికే ఈ కమిటీలు ఖరారైనట్లు చెప్తుండగా.. అధికారికంగా స్పీకర్ సభాకమిటీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.
నేటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు..
సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో 2019–20 వార్షిక బడ్జెట్‌ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. బడ్జెట్ సమావేశాల దృష్ట్యానే సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారు. చీఫ్ విప్‌లు, విప్‌లను నియమించారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం కొత్త, పాత మంత్రులతో ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి సమావేశయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా శాసనసభ సమావేశాలకు హాజరైన దాస్యం వినయభాస్కర్ ఈ సారి ప్రభుత్వ చీఫ్ విప్ హోదాలో పాల్గొననున్నారు. తొలి మహిళా మంత్రిగా సత్యవతిరాథోడ్ సమావేశాలకు హాజరు కానున్నారు. అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, ఎం.యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరెందర్, రెడ్యానాయక్ తదితరులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. శాసనమండలిలో చీఫ్ విప్‌గా తొలిసారి బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment