సాక్షి, హైదరాబాద్: వసతిగృహాల్లోని విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. విశ్వదర్శిని పేరిట ప్రతిభావంతులైన విద్యార్థులను విదేశీ పర్యటనలకు తీసుకెళ్తోంది. అంతేకాదు.. అక్కడ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌తో పాటు సంబంధిత అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారీకి సహకరించనుంది. పర్యటనలో భాగంగా సందర్శించిన సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వనుంది. ఇదంతా విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటన వినోదాత్మకంగా కాకుండా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడం, సరికొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి బాటలు వేయనుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలోని ఆసక్తిగల విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేసింది. మొత్తం 100 మంది ఆసక్తి చూపగా.. వారిలో నుంచి 18 మందిని ఎంపిక చేసింది. తొలివిడత వీరిని విశ్వదర్శిని పర్యటనకు సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొత్తం 18 మందికిగాను రూ.28 లక్షలు విడుదల చేసింది.
ఐదు దేశాలు.. నాలుగు వారాలు
విశ్వదర్శిని కార్యక్రమంలో భాగంగా ఐదు దేశాల్లో విద్యార్థులు పర్యటించనున్నారు. ఫిన్లాండ్, గ్రీస్, పోలెండ్, టర్కీతో పాటు చైనాకు వెళ్లనున్నారు. నాలుగు వారాల పాటు సాగే ఈ టూర్‌లో విద్యార్థులు వారి సబ్జెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల రూపకల్పన, సంబంధిత సంస్థల సందర్శన చేపడతారు. అదేవిధంగా ప్రాజెక్టుపై ఇంటర్న్‌షిప్ సైతం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పర్యటన అనంతరం సంక్షేమ శాఖ, సంబంధిత సంస్థ సర్టిఫికెట్‌లు ఇవ్వనుంది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి తదితర పథకాల అర్హుల ఎంపికలో ఈ సర్టిఫికెట్లను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రామాణికంగా తీసుకోనుంది. ప్రభుత్వ సాయంతో పాటు ఎంపికైన విదేశీ యూనివర్సిటీల్లో ఈ విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పర్యటనతో విద్యార్థులకు వివిధ దేశా లు, సంస్కృతులపై అవగాహన ఏర్పడటంతో పాటు నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుందని ఎస్సీ అభివృ ద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ పేర్కొన్నారు.
వసతిగృహ విద్యార్థులకు ‘విశ్వదర్శిని’
Published Fri, Dec 28 2018 12:53 AM | Last Updated on Fri, Dec 28 2018 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment