స్కూల్‌ బస్సులు @ ఆన్‌లైన్‌ | School Bus Mobile App For Bus Fitness Details | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సులు @ ఆన్‌లైన్‌

Published Thu, May 17 2018 10:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

School Bus Mobile App For Bus Fitness Details - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మీ పిల్లలు పయనించే స్కూల్‌ బస్సు సామర్థ్యాన్ని, ఆ బస్సు నడిపే డ్రైవర్‌ల అర్హత, అనుభవం వంటి వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా...స్కూల్‌  బస్సుల కండీషన్‌పై సందేహాలు ఉన్నాయా...డోంట్‌వరీ. ఇప్పుడు ప్రతి బడి బస్సు జాతకం మీకు ఆన్‌లైన్‌లో  లభించనుంది. మీ పిల్లలు వెళ్లే  స్కూల్‌ మాత్రమే కాదు. ఏ విద్యాసంస్థకు చెందిన వాహనాల వివరాలైనా  ఆన్‌లైన్‌లో ఇట్టే  తెలుసుకోవచ్చు. అంతేకాదు. ‘స్కూల్‌ బస్సు’ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా  బడి బస్సుల వివరాలను  పొందవచ్చు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని  సుమారు  10,050 స్కూల్‌ బస్సుల వివరాలను ఆన్‌లైన్‌లో  ఉంచేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు పిల్లల భద్రత  దృష్ట్యా  ప్రతి స్కూల్‌ యాజమాన్యం విధిగా తమ స్కూల్‌ బస్సులకు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని  రవాణాశాఖ  సూచించింది. బస్సుల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి, అలసత్వానికి తావు లేకుండా పటిష్టమైన  చర్యలు చేపట్టినట్లు  హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌  పాండురంగ్‌ నాయక్‌ ‘సాక్షి’తో చెప్పారు. నిర్ణీత గడువులోగా  ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరుకాని వాటిని జఫ్తు చేయనున్నట్లు  హెచ్చరించారు. 

సిబ్బంది వివరాలు ఉండాల్సిందే...
ప్రతి సంవత్సరం  మే రెండో వారం నుంచి జూన్‌  మొదటి వారం వరకు స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. బస్సుల సామరŠాధ్యన్ని పరీక్షించడంతో పాటు  వాటిని నడిపే డ్రైవర్‌లు, అటెండర్‌ల వివరాలను, అర్హతలను కూడా రవాణాశాఖ పరిగణనలోకి తీసుకుంటుంది.ఈ సారి  ఫిట్‌నెస్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకొనే సమయంలో  బస్సుల వివరాలతో పాటు  వాటిని నడిపే ఇద్దరు డ్రైవర్లు, అటెండర్‌ల  అర్హత, డ్రైవింగ్‌ లైసెన్సు, అనుభవం, ఫొటోలు  కూడా  అప్‌లోడ్‌ చేయాలని  అధికారులు సూచించారు. ప్రతి బస్సుకు ఒక ప్రధాన డ్రైవర్, మరో  ప్రత్యామ్నాయ డ్రైవర్‌  తప్పనిసరి.ఇలా  స్లాట్‌ బుకింగ్‌ సమయంలోనే  వివరాలన్నింటినీ  ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల  ఏ బస్సును ఏ డ్రైవర్లు నడుపుతున్నారో, బస్సు నడిపే సమయంలో విధినిర్వహణలో ఉన్న అటెండర్‌  గురించి తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్టీఏ అధికారులే కాకుండా  తల్లిదండ్రులు కూడా స్కూల్‌ బస్సుల పర్యవేక్షకులుగా వ్యవహరించేందుకు అవకాశం లభిస్తుందని జేటీసీ తెలిపారు. ఈ  వివరాలన్నింటినీ ‘స్కూల్‌ బస్‌’ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా  తెలుసుకోవచ్చు. గత రెండేళ్లుగా బస్సుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నప్పటికీ  దీనిని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు, సిబ్బంది వివరాలను కూడా  ఈ సారి తప్పనిసరి చేశారు. ముందస్తుగా ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంతో  పాటు అనుకోని దుర్ఘటనలు ఎదురైనప్పుడు చేపట్టివలసిన చర్యలకు  కూడా ఆన్‌లైన్‌ సమాచారం దొహదం చేస్తుందని  రవాణాశాఖ భావిస్తోంది. 

బస్సుల్లోసీసీ కెమెరాలు...
మరోవైపు  స్కూల్‌ బస్సుల భద్రతను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు  సీసీ కెమెరాల ఏర్పాటును కూడా  అధికారులు పరిశీలిస్తున్నారు. బస్సు లోపలివైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా  డ్రైవర్‌ నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పాటు పిల్లల పట్ల సిబ్బంది ప్రవర్తన, పిల్లలను జాగ్రత్తగా బస్సు ఎక్కించేందుకు, తిరిగి ఇళ్ల వద్ద దించేందుకు సిబ్బంది చూపే శ్రద్ధ వంటి వివరాలను  తెలుసుకోవచ్చునని అధికారులు  భావిస్తున్నారు.

ఈ నిబంధనలు తప్పనిసరి....
ప్రతి స్కూల్‌ బస్సు కచ్చితమైన నిబంధనలు పాటించాలి. అన్నివిధాలుగా సమర్ధవంతంగా ఉంటేనే  అధికారులు ఫిట్‌నెస్‌ ధృవీకరణ పత్రాలను అందజేస్తారు.  
బస్సు పసుపు  రంగులో  ఉండాలి.రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి.విద్యార్ధులు బస్సులోకి ఎక్కడం,దిగడం డ్రైవర్‌కు  స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్‌ క్రాస్‌ వ్యూ అద్దాలు అమర్చాలి.బస్సులోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్‌కు  కనిపిస్తారు.
బస్సు ఇంజన్‌ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌),పొడి అందుబాటులో ఉండాలి.అత్యవసర ద్వారాం ఉండాలి.ఫస్ట్‌ ఎయిడ్‌బాక్స్‌ ఏర్పాటు చేయాలి.
సదరు పాఠశాల/కళాశాల పేరు,టెలిఫోన్‌ నెంబర్,మొబైల్‌ నెంబర్,పూర్తి చిరునామ బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి.
వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబర్‌ (గాఢ పసుపు పచ్చని) రంగుగల  ఫ్లాపింగ్‌ లైట్లను ఏర్పాటు చేయాలి.పిల్లలు దిగేటప్పుడు,ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.
సదరు వాహనం స్కూల్‌ బస్సు అని తెలిసేవిధంగా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్ధులు (ఒక అమ్మాయి,ఒక అబ్బాయి) నల్లరంగులో  చిత్రించి ఉండాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్‌ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి.అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి.
బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్‌ సిస్టమ్‌తో ఉండాలి.సైడ్‌ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి.సీటింగ్‌ సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఉండొద్దు.
ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి.అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి.
బస్సులో ప్రయాణించే విద్యార్ధుల పేర్లు,తరగతులు,ఇళ్ల చిరునామాలు,ఎక్కవలసిన, దిగవలసిన వివరాలు బస్సులో ఉండాలి.

డ్రైవర్ల అర్హతలు ...
డ్రైవర్‌ వయస్సు 60ఏళ్లకు మించకుండా ఉండాలి.పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్‌ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి.  
యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకు  ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు,షుగరు,కంటి చూపు వంటి ఆరోగ్య  పరీక్షలు నిర్వహించాలి.
డ్రైవర్‌కు  బస్సు డ్రైవింగ్‌లో  కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
డ్రైవర్,అటెండర్‌కు యూనిఫాం తప్పనిసరి.
ఈ అంశాలపై పేరెంట్స్‌ కమిటీ అప్రమత్తంగా ఉండాలి. వీటిపై ప్రిన్సిపాల్‌తో చర్చించాలి.
ఫస్ట్‌యిడ్‌ బాక్సులో మందులు, ఇతర పరికరాలు కూడా తనిఖీ చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement