
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను శాస్త్రీయంగానే పూర్తి చేశామని, రాత్రికి రాత్రే పూర్తి చేశామనే ఆరోపణ అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అభ్యంతరాల పరిష్కారానికి ఐదు రోజుల సమయం తీసుకున్నామని వివరించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను 109 రోజుల నుంచి 8 రోజులకు తగ్గించామనేది అసత్యమని, వార్డుల విభజన ప్రక్రియ మాత్రమే 8 రోజుల్లో పూర్తి చేశామని వివరించింది. ఒకే ఒక్క రోజులోనే ఎలా చేశారని, ఇది నమ్మశక్యంగా లేదంటూ గత విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యానించింది.
కౌంటర్ దాఖలు చేసిన తీరును కూడా తప్పుపట్టింది. దీంతో ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సమగ్రంగా 21 పేజీల కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం దృష్టికి ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తీసుకెళ్లారు.
రిజర్వేషన్ల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని పేర్కొంటూ జిల్లా కేంద్రమైన నిర్మల్‌కు చెందిన కె.అంజుకుమార్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. గురువారం ఈ పిల్‌పై విచారణ జరపాలని అదనపు ఏజీ కోరారు. అయితే పిటిషనర్ న్యాయవాది వాదనలు కూడా తెలియజేసే నిమిత్తం విచారణను 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.