ప్రగతినగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు రెండవ రోజు కూడా చేదు అనుభవం మిగిల్చింది. జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు ఆందోళనకు దిగారు. మరికొందరు పంచాయతీ, మండల కార్యాలయాలను ముట్టడించారు. సాంకేతిక కారణాలతోపాటు బ్యాంకుల నుంచి రూ. పది లక్షల పైబడి డబ్బులు డ్రా చేయని పరిస్థితి, సిబ్బంది కొరత తదితర కారణాలతో రెండవ రోజూ మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్ కమ్యూనిటీ హాలులో అసలు అధికారులే రాక పింఛన్‌దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోటగల్లి పద్మశాలి సంఘంలో పేర్లు ఉన్నవారికీ పింఛన్లు అందించలేకపోయారు. 50వ డివిజన్‌లో సాయంత్రం వరకు అదికారులు చేరుకోలేకపోయారు.
నిజామాబాద్ మండలంలో పలు గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. పింఛన్ రానివారు ఆందోళనకు దిగారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. మామిడిపల్లి, అమ్రాద్ గ్రామస్తులు ఎంపీడీఓఓ వద్ద కార్యాలయం ధర్నా చేసారు. బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, కోటగిరి మండలం చిక్కడ్‌పల్లి గ్రామాలలో వృద్ధులు, సిరికొండ మండలంలో వృద్ధులు, వికలాంగులు ధర్నా నిర్వహించారు.
అర్హులందరికీ పింఛన్లు వచ్చే వరకు పంపిణీ చేయవద్దని సర్పంచ్ సాయన్నను, వీఆర్‌ఓను వెనక్కు పంపించి వేశారు. బోధన్ పట్టణంలో పోలీసు బందోబస్తు మధ్య ఫించన్ల పంపిణి జరిగింది. నవీపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా లబ్ధిదారులు ఎగబడటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని క్యూ పద్ధతిలో కొనసాగించారు. కామారెడ్డి పట్టణంలో అర్హుల పేర్లు జాబితాలో లేవని బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
రెండో రోజు ఇదీ పరిస్థితి
రెండవ రోజు అధికారులు పింఛన్లను మొక్కుబడిగా అందించారు. మొదటి రోజు కేవలం 21.157 మందికే పింఛన్లు అందాయి. గురువారం 60,007 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రెండు రోజులలో 81,164 మంది లబ్ధిదారులకు 17.10 కోట్లు పంపిణి చేశారు.
రెండో రోజూ అంతంతే!
Published Fri, Dec 12 2014 3:46 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement