ఆత్మహత్యలపై విపక్షాల రాద్ధాంతం
మండిపడిన టీఆర్‌ఎస్ ఎంపీలు
నిజామాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పదేళ్లు పాలించిన కాం గ్రెస్ పార్టీ రైతాంగాన్ని విస్మరించడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సహా 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రి పోచారం మాట్లాడుతూ త్వరలోనే ఉత్తర, దక్షణ తెలంగాణల్లో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే ప్రాణహిత-చేవెళ్లను రూ. 35 వేల కోట్లతో చేపట్టామని చెప్పారు. 13 లక్షల 40 వేల మంది రైతులకు రూ.4 వేల కోట్ల ఇన్‌పుట్స్‌ను అందించామని పేర్కొన్నారు.
ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు అందించి రైతు ఆత్మహత్యలను నివారిస్తామన్నారు. కేసీఆర్ తెలంగాణ తొలి సీఎం కావడం అదృష్టమని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. 2004, 2009లలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన డీఎస్ ఆ పార్టీని వీడారంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్, పరిస్థితి అర్థం చేసుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పనికి మాలిన విమర్శలు చేస్తోందని విమర్శించారు. సమావేశంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, బాల్క సుమన్, జి.నగేశ్, సీతారాంనాయక్, ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బి.బి.పాటిల్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, నగర మేయర్ తదితరులు పాల్గొన్నారు.