రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్తదా: రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఏడవని రోజులేదని, ఇలాంటి రాజ్యం బాగుపడుతుందా అని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు, మార్కెట్లలో మిర్చిపంటకు ధరలేకపోవడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పత్తిని సాగు చేయకుండా పప్పు ధాన్యాలు, మిరప పంటలను వేయాలని చెప్పిన ప్రభుత్వం వాటికి సరైన ధర కల్పించకుండా మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు 1.43లక్షల ఎకరాల్లో మిరప పంటను సాగుచేశారని, నకిలీవిత్తనాల కారణంగా రూ. 500 కోట్లు నష్టపోయారని చెప్పారు. సబ్సిడీ విత్తనాల పేరుతో ప్రభుత్వం కమీషన్లను దండుకుంటుందని ఆరోపించారు.