
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరం, అన్యాయం జరిగితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాం.. మరి ఆ పోలీసుతోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే.. ఉన్నతాధికారులను కలవాలి. కానీ అందుకు చాలా సమయం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ప్రజలను ఇబ్బందులు పెట్టే ఖాకీలపై ఉన్నతాధికారులకు ఇట్టే ఫిర్యాదు చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో హ్యాక్ ఐ యాప్ ఉంటే చాలు ఈ పని క్షణాల్లో చేసేయొచ్చు. కొంతకాలంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా సోషల్ మీడియాలో పాత పోస్టులు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఫలానా పోలీసు తమ సమస్యను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారన్న వార్తలూ వస్తున్నాయి. అందులో నిజానిజాలు తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
‘వయొలేషన్ బై పోలీస్’లో ఫిర్యాదు
దుష్ప్రచారాల నివారణ, అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోలీసులపై ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పోలీసు శాఖలో పూర్తి పారదర్శకత కోసం ‘హ్యాక్ ఐ’లో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. వయొలేషన్ బై పోలీస్.. అనే ఆప్షన్‌ను పొందుపరిచారు. ప్రజల నుంచి ఫిర్యాదు తీసుకోకపోయినా, ఎఫ్‌ఐఆర్ నమోదు తిరస్కరించినా, దురుసుగా ప్రవర్తించినా, ప్రతిఫలం ఆశించినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఏకపక్షంగా వ్యవహరించినా, సరిగా స్పందించకున్నా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు.. తదితర విషయాలపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.
ఎక్కడ జరిగిందో చెబుతూ ఫొటోలు, వీడియోలు సహా ఆధారాలు జత చేయొచ్చు. ఇది నేరుగా ఉన్నతాధికారులకే చేరుతుంది కాబట్టి.. నిమిషాల్లో బాధితుల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో తప్పుడు ప్రచారాలకు తెరపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.