నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా అత్యవసర విభాగం, గైనిక్ విభాగాల్లో వైద్యులు లేక సరైన సేవలు అందడం లేదు. వైద్య కళాశాల అసిస్టెంట్లు ప్రొఫెసర్లు సేవలందించడానికి ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఆస్పత్రికి రాని అసిస్టెంట్ ప్రొఫెసర్లు
అత్యవసర విభాగంలో 16 మంది వైద్యులు ఉండాల్సి ఉంది. కాగా కాంట్రాక్టు ముగియడంతో ఎనిమిది మంది విధులకు రావడం లేదు. మరో ఆరుగురు రెగ్యులర్‌గా విధులకు హాజరు కావడం లేదు. దీంతో ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రోజుకు 20 నుంచి 25 కేసులు వస్తున్నాయి. పనిభారంతో ఈ ఇద్దరు వైద్యులు ఒత్తిడికి గురవుతున్నారు.
గైనిక్ విభాగంలో తొమ్మిది మంది వైద్యులు అవసరం కాగా.. ఇద్దరే అందుబాటులో ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 16 మందిని అత్యవసర విభాగంలో వైద్యసేవలు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు. కానీ ఆస్పత్రిలో సేవలందించడానికి వీరు నిరాకరిస్తున్నారు. అత్యవసర సేవలు అందించడం మా బాధ్యత కాదంటూ తప్పించుకుంటున్నారని తెలిసింది.
ఒకరికి పదిరోజులకు ఒకసారి విధుల కేటాయింపు జరుగుతున్నా.. సేవలు అందించడానికి ముందుకు రావడం లేదు. దీంతో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల కొరతతో అత్యవసర విభాగం, గైనిక్ సేవలతోపాటు పోస్టుమార్టం సేవలు సైతం త్వరగా అందడం లేదు. సూపరింటెండెంట్ ఒక్కరే ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాలా మంది ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు నిర్వహిస్తున్నారని, కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది. అందుకే వారు సర్కారు దవాఖానాలో సేవలందించడానికి ముందుకు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు కరువు
Published Sat, Apr 9 2016 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
Advertisement
Advertisement