వైద్యోవివేకానంద | Vivekananda's birth anniversary today | Sakshi
Sakshi News home page

వైద్యోవివేకానంద

Published Mon, Jan 12 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

వైద్యోవివేకానంద

వైద్యోవివేకానంద

వైద్యాన్ని కూడా వ్యాపారం లాగా చేసే వైద్యులు ఉన్న ఈ రోజుల్లో... అందుకు భిన్నంగా ఓ పదిహేను మంది డాక్టర్లు  స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని వైద్యులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ వంతుగా సమాజ సేవ కూడా చేస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలోని ధన్నారం గ్రామ సమీపంలో ఓ అనాథ ఆశ్రమాన్ని నెలకొల్పి గత ఏడేళ్లుగా అనాథ పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నారు. నేడు వివేకానందుడి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
 
- మొరంగపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ సాక్షి, వికారాబాద్


సాధారణ, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన డాక్టర్ రాజశేఖర్ ఈ ఆశ్రమ ఏర్పాటుకు ప్రధాన సూత్రధారి. ఈయన  స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా, ఇటికల మండలం, మునుగాల గ్రామం. ఈయన ఎంఎస్ పూర్తి చేసి మొదట తాండూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆనాటి నుంచే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.

గత ఐదేళ్లుగా వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్త్తూ సామాజిక సేవను కొనసాగిస్తున్నారు. తన ఇంటి దగ్గర కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఎవరైనా ఫీజు ఇవ్వబోతే... పక్కనే ఏర్పాటు చేసుకున్న స్వామి వివేకానందుడి పేరుమీద ఉన్న హుండీలో వేయించి, ఆ డబ్బును అనాథ పిల్లల భోజనానికి, దుస్తులకు ఖర్చు చేస్తారు.
 
వివేకానందుడే ప్రేరణ
డాక్టర్ రాజశేఖర్‌కు బాల్యం నుంచి స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం అలవాటు. స్వామి వివేకానంద జీవితం డాక్టర్ రాజశేఖర్ మనస్సును మార్చేసింది. ఆయన మార్గంలోనే నడవాలని తపించేవారు. చిన్నతనంలో చదువుకునేందుకు  కష్టాలు ఎదురవడంతో తనలా కష్టాల్లో ఉన్న కొందరికైనా తనవంతు సహాయాన్ని అందించాలనుకున్నారు. అందుకు వివేకానందుడి మార్గమే సరైనదని నమ్మారు. తనతోపాటు ఆ సంస్థను కొనసాగించేందుకు సహకరిస్తున్న స్నేహితులకు సేవా దృక్పథాన్ని కలిగించారు.

వికారాబాద్ మారుమూల గ్రామాల్లో రోజుకు ఒకరిద్దరు ఆర్థిక కారణాలతో, కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడటం, వారు ఆస్పత్రికి వచ్చాక చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోవడం, వారి పిల్లలు అనాథలు కావడం వంటి ఎన్నో సంఘటనలు రాజశేఖర్ మనస్సును కలచివేశాయి. ఇలాంటి విషాదకరమైన ఎన్నో సంఘటనలు ‘యజ్ఞ’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు పునాదులు వేశాయి. అనాథ పిల్లలకు అండగా నిలవాలనే ఆయన తపనే ఆ ఆశ్రమం ఏర్పాటుకు దారి తీసింది.

డాక్టర్ రాజశేఖర్‌కు వచ్చిన ఆలోచనను హైదరాబాద్‌లోని తన వైద్యమిత్రులు సతీష్, శైలజ, విజయ్, సురేందర్, రామకృష్ణలతో పంచుకున్నారు. రాజశేఖర్ ఆలోచనతో ఏకీభవించిన వారందరూ ‘యజ్ఞ ఫౌండేషన్’గా ఏర్పడ్డారు. అనుకున్నదే తడవుగా వీరంతా కలిసి ఆలోచనను ఆచరణలో పెట్టారు. అందుకు ప్రతిరూపమే 2007లో వెంకటాపూర్ తండా సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అనాథాశ్రమం.

నేడు మండల పరిధిలోని దన్నారం గ్రామం సమీపంలో రెండు ఎకరాలను కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో భవనం నిర్మించి అక్కడే పాఠశాలను, వసతిగృహాన్ని ఏర్పాటు చేసి, యజ్ఞ అనాథ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఎండీ పూర్తి చేసిన డాక్టర్ రాజశేఖర్ భార్య శైలజ కూడా అనాథ పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నారు.

ఆటపాటల్లోనూ శిక్షణ
ప్రస్తుతం యజ్ఞ ఆశ్రమంలో 58 మంది అనాథ పిల్లలు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పదిమంది ఉపాధ్యాయులతో ఎనిమిదవ తరగతి వరకు అక్కడ పాఠాలు బోధిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా మూడు నుంచి పదమూడు లోపు వారే. ప్రతిరోజు వీరికి విద్యాబోధనతో పాటు ఆటపాటల్లో శిక్షణ ఇస్తున్నారు. తాము అనాథలమనే భావన వారి దరి చేరకుండా ప్రేమానురాగాలను పంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement