సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా సంక్షోభం.. పనుల్లేవ్.. పైసల్లేవ్..! అందరికీ ఇబ్బందులే.. ఇక ప్రైవేటు ఉద్యోగులు, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) ఆలస్య రుసుముల పేరుతో సెట్ కమిటీలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఓ విధానం అంటూ లేదు. రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు ఆలస్య రుసుము విధిస్తున్నాయి. ఒక్కో సెట్ ఒక్కో రకంగా ఆలస్య రుసుమును వసూలు చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పోనీ పరీక్షల సమయం వచ్చేసింది.. ఇప్పటికిప్పుడు వారికి హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపు చాలా కష్టం.. పైగా ఆయా విద్యార్థులు ఇన్నాళ్లు దరఖాస్తు చేసుకోకపోవడం తప్పు అన్న పరిస్థితి.. ఇప్పుడు లేనేలేదు.
ఇంకా నెల రోజుల వరకు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశమే కనిపించడం లేదు. అయినా దరఖాస్తులకు ఆలస్య రుసుములు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ విద్యార్థుల నుంచి దండుకుంటుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం గతంలో ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు ఉచితంగా దరఖాస్తుల సబ్మిట్ చేసే అవకాశం ఇవ్వలేదు. గతంలో ఫీజు చెల్లించినా.. ఇప్పుడున్న ఆలస్య రుసుమును చెల్లిస్తేనే దరఖాస్తులను స్వీకరిస్తామని వెబ్‌సైట్‌లో పెట్టడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
దరఖాస్తుల గడువును ముగించేశాయి..
పరీక్షల తేదీలు లేకపోయినా మెున్నటివరకు దరఖాస్తుల గడువును పలు సెట్ కమిటీలు ముగించేశాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా 4 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.. కానీ దరఖాస్తులను సబ్మిట్ చేయలేకపోయారు. సైట్ ఓపెన్ చేసిన తరువాత ఫీజు చెల్లించారు.. ఆ తరువాత దరఖాస్తు ఫాం ఓపెన్ కావడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.
కొంతమంది నిర్దేశిత సర్టిఫికెట్లు, ఇతర వివరాలు ఆ సమయంలో అందుబాటులో దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన దరఖాస్తుల గడువును పొడిగించేలా సెట్ కమిటీలను ఆదేశించారు. దీంతో పలు సెట్ కమిటీలు దరఖాస్తుల గడువును పొడిగించాయి. అయితే ఇక్కడ మరో మెలిక పెట్టాయి.
ఫీజు చెల్లించినా ఆలస్య రుసుము కట్టాల్సిందే..
దరఖాస్తుల గడువును కొన్ని సెట్స్‌కు ఈనెల 20 వరకు, మరికొన్నింటికి ఈనెల 25 వరకు, కొన్ని ఈనెల 31 వరకు ఆలస్య రుసుముతో పొడిగించాయి. గతంలోనే ఫీజు చెల్లించి, దరఖాస్తులను సబ్మిట్ చేయలేని వారు కూడా ఇపుడు విధించే ఆలస్య రుసుమును చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఐసెట్‌కు గతంలో ఫీజు చెల్లించి దరఖాస్తులను సబ్మిట్ చేయనివారు 1,358 మంది ఉన్నారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. ఎడ్‌సెట్ దరఖాస్తులను సబ్మిట్ చేయని వారు 685 మంది రూ. 2 వేలు, లాసెట్ ఫారాలు సబ్మిట్ చేయని వారు 751 మంది రూ. 4 వేలు, ఈసెట్, ఎంసెట్ విద్యార్థులైతే రూ.10 వేలు ఆలస్య రుసుమును చెల్లిస్తేనే దరఖాస్తులను సబ్మిట్ చేసేలా అవకాశం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment