
దోపిడీకి మంగళం
సంగారెడ్డి మున్సిపాలిటీ : మున్సిపల్ కార్మికులకు ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ మంచి కానుక ఇచ్చారు. నెలల తరబడి జీతాల కోసం ఎదురుచూసే అగత్యం తప్పించారు. ఏకంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్టు వ్యవస్థకే మంగళం పాడుతూ జీవో జారీ చేశారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి టీఎల్‌ఎఫ్ (టౌన్ లెవల్ ఫెడరేషన్) ద్వారా వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంగారెడ్డి గ్రేడ్ - 1 మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా, పంపింగ్, శానిటేషన్, డ్రైవర్స్, కార్యాలయ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్స్, స్ట్రీట్ లైట్స్ లైన్‌మెన్‌లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న సుమారుగా 275 మంది కాంట్రాక్ట్ కార్మికులకు మేలు జరగనుంది.
మాట నిలబెట్టుకున్న శరత్
మున్సిపాలిటీలో పనిచేసేందుకు అవసరమైన కార్మికులను నియమిం చేందుకు గత ఏడాది ఆగస్టు 23న టెండర్లు పిలిచారు. టెండరు దక్కిం చుకున్న కాంట్రాక్టర్ ద్వారానే కార్మికులకు వేతనాలు అందేవి. ఈ నేపథ్యంలో కార్మికులకు సరైన వేతనాలు అందకపోవడం...చెల్లింపుల్లో నెల ల తరబడి జాప్యం నెలకొనడంతో కార్మికులు పలుమార్లు ఆందోళన బా టపట్టారు. అప్పట్లో మున్సిపల్ ప్రత్యేకాధికారిగా ఉన్న శరత్‌కు వినతి పత్రాలు సమర్పించారు. స్పందించిన శరత్ త్వరలోనే కాంట్రాక్టు కార్మికులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇన్‌చార్జి కలెక్టర్ హోదాలో శరత్ కార్మికుల డిమాండ్ నెరవేర్చారు. గత ఆగస్టులో వేసిన టెండర్లను సైతం రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. దీంతో కార్మికులు ఇకనుంచి ఏ కాంట్రాక్టర్ కింద పనిచేయాల్సిన పరిస్థితి తప్పిపోయింది.